Latest News
ఉప్పల్ స్టేడియం ముందు నిరసన…సన్‌రైజర్స్‌పై టీడీసీఏ ఆగ్రహం
posted on: Mar 24, 2026 6:46PM

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) ముందు టీడీసీఏ, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మెరుపు ధర్నా నిర్వహించారు. టీడీసీఏ అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలంగాణకు చెందిన ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శించారు. స్థానిక ప్రతిభను విస్మరిస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ. 2.34 కోట్ల రూపాయలు పెట్టి హండ్రెడ్ లీగ్‌లో కొనుగోలు చేసే స్థోమత సన్ గ్రూప్‌కు ఉందని, అయితే తెలంగాణలో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి వారి వద్ద పైసలు లేవని వ్యంగంగా వ్యాఖ్యానించారు.
మీరు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పాకిస్తాన్ ప్లేయర్లను కొంటుంటే వాళ్లేమో ఇండియా పైన ఉగ్రదాడులు చేస్తున్నారు...అంతేకాక, డెక్కన్ చార్జర్స్ యాజమాన్యం నుంచి సన్‌రైజర్స్ చేతుల్లోకి జట్టు వెళ్లిన తర్వాత నుంచి తెలంగాణ ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, పంజాబ్ జట్లు తెలుగు ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తుండగా, సన్‌రైజర్స్ మాత్రం స్థానికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
జట్టులో సీఈఓ నుంచి సహాయ సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది చివరికి ఎస్ ఆర్ హెచ్ మీడియా మేనేజర్ వరకు అందరూ తమిళనాడుకు చెందిన వారేనని పేర్కొంటూ, తమిళనాడుపై అంత ప్రేమ ఉంటే జట్టు పేరును మార్చుకుని అక్కడే మ్యాచ్‌లు నిర్వహించు కోని... అక్కడే వ్యాపారం చేసుకోండి అంటూ మండిపడ్డారు. మీకు తెలంగాణ పైసలు కావాలి ఇక్కడ బిజినెస్ కావాలి మా వనరులన్నీ వాడుకుంటారు కానీ ప్రతిభావంతులైన మా పిల్లలకు ఆడే అవకాశాలు ఇవ్వరా అంటూ ధ్వజమెత్తారు...ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, అలాగే సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రతినిధి కావ్య మారన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో ఉప్పల్ ప్రాంతంలో కొంత సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






