Latest News

జగన్‌కు విజయమ్మ బిగ్ షాక్... ఆస్తులపై కీలక ప్రకటన

posted on: Mar 20, 2026 4:03PM

 

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరింత ముదురుతున్న వేళ… తల్లి విజయమ్మ చేసిన ప్రకటన రాజకీయంగా, కుటుంబ పరంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఆమె విడుదల చేసిన నోటరీ స్టేట్‌మెంట్ ఇప్పుడు కీలకంగా మారింది.ఆ ప్రకటనలో వైఎస్ విజయమ్మ స్పష్టం చేసిన అంశాలు గమనిస్తే… 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ వ్యక్తిగతంగా ఎవరికీ చెందని ఉమ్మడి కుటుంబ ఆస్తులేనని తెలిపారు. 

కుటుంబంలో ఎప్పుడూ అధికారికంగా ఆస్తుల పంపకం జరగలేదని, అది వైఎస్సార్‌ ఉద్దేశం కూడా కాదని ఆమె పేర్కొన్నారు.అయితే, ఆస్తుల విషయంలో తన కుమారుడు వైఎస్ జగన్ కుమార్తె వైఎస్ షర్మిల మధ్య తలెత్తిన విభేదాలపై విజయమ్మ స్పష్టమైన వైఖరి వ్యక్తం చేశారు. పిల్లలిద్దరికీ సమాన హక్కులు ఉండాలనేదే వైఎస్సార్ ఆశయమని, అంతేకాకుండా మనుమల నలుగురికీ సమానంగా ఆస్తులు పంచాలన్నదే ఆయన అభిప్రాయం అని వెల్లడించారు.

షర్మిలకు ఎంఓయూలో  పేర్కొన్న ఆస్తులన్నీ న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని, అందుకే జగన్ స్వయంగా ఆ ఒప్పందంపై సంతకం చేశారని ఆమె చెప్పారు. వాస్తవానికి, షర్మిలకు రావాల్సిన వాటా కంటే తక్కువగానే ఇచ్చారని, సరస్వతి సిమెంట్‌తో పాటు ఎంఓయూలో లేని యెలహంక భూమి కూడా ఆమె హక్కేనని విజయమ్మ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన డబ్బు కూడా షర్మిల వాటాకు చెందిన డివిడెండ్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.

ఈ క్రమంలో, తన మనుమలు–మనవరాళ్లకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన విజయమ్మ… ఎప్పటికైనా జగన్ న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానన్నారు. ప్రస్తుతం మీడియాలో ప్రచారం అవుతున్న విషయాల్లో చాలా వరకు అసత్యాలు ఉన్నాయని, “గోబెల్స్ ప్రచారం” మానుకోవాలని ఆమె హెచ్చరించారు. చివరగా, దేవుడిని సాక్షిగా చేసుకుని తాను చెప్పిన ప్రతి మాట నిజమని, ఈ అంశాన్ని మళ్లీ మళ్లీ మీడియా లాగకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు.మొత్తంగా, విజయమ్మ ప్రకటనతో కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి రాజకీయ రంగంలో హాట్‌టాపిక్‌గా మారింది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...