Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదం: నటుడు ప్రకాష్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు!
posted on: Jun 30, 2026 5:12PM

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ సాహిత్య ఉత్సవం వేదికగా ఆయన శ్రీరాముడు, లక్ష్మణుడు, పవిత్ర గ్రంథం రామాయణంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలోని 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ప్రకాష్ రాజ్‌పై ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దాంతో న్యాయస్థానం ఈ కేసును విచారణకు స్వీకరించింది.
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. వారు దక్షిణాదికి వచ్చి రావణుడి తోటలోని పండ్లను దొంగిలించారంటూ రామాయణాన్ని హాస్యాస్పదంగా, కించపరిచేలా చిత్రీకరించారని భానుప్రకాశ్రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
కాగా ఏప్రిల్ నెలలోనే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తన న్యాయవాది కె. అజయ్ కుమార్ ద్వారా ప్రకాష్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన అనుచిత వ్యాఖ్యలపై కోట్లాది మంది హిందూ సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని ఆ నోటీసులో హెచ్చరించారు. అయితే, ఈ లీగల్ నోటీసులపై ప్రకాష్ రాజ్ స్పందించక పోవడంతో.. భానుప్రకాశ్ రెడ్డి ఇప్పుడు తిరుపతి న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
ఫిర్యాదుదారు తన పిటిషన్‌లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు మత విద్వేషాలను, ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఆధారాలు లేని ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తూ భారత సాంస్కృతిక, మత ఐక్యతను దెబ్బతీసేందుకు నటుడు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు.
మరోవైపు ప్రకాష్ రాజ్‌కు చట్టపరమైన సమస్యలు ఒక్క తిరుపతితోనే ఆగడం లేదు. బెంగళూరు కోర్టులో నడుస్తున్న ఓటరు గుర్తింపు కార్డుల అక్రమాల కేసులో ఆయనకు ఇప్పటికే వరుసగా మూడు సార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకే పేరుతో బహుళ ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే ప్రైవేట్ పిటిషన్ ఆధారంగా ఆ విచారణ సాగుతోంది. కోర్టు సమన్లకు హాజరుకాకపోవడంతో జూన్ 12న బెంగళూరు కోర్టు మూడోసారి అరెస్టు వారెంట్ జారీ చేస్తూ విచారణను జులై 25కు వాయిదా వేసింది.


.webp)



