Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భారతీయ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన అగ్నిపుత్రిక పృథిలతా వడ్డేదార్
posted on: May 7, 2026 4:33PM

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఎందరో వీరులు తమ రక్తాన్ని ధారబోశారు. వారిలో 21 ఏళ్ల ప్రాయంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాద అహంకారాన్ని నేరుగా సవాలు చేసి, మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన వీరనారి పృథిలతా వడ్డేదార్ ముందు వరుసలో ఉంటారు. బెంగాల్ విప్లవ చరిత్రలో తొలి మహిళా అమర వీరురాలిగా గుర్తింపు పొందిన ఆమె.. ఆయుధ పోరాటం ద్వారా తెల్లవారి గుండెల్లో నిద్రపోయింది. ఒక సామాన్య ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి, సాయుధ విప్లవ నాయకురాలిగా రూపాంతరం చెందిన ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం.
1911 మే 5న తూర్పు బెంగాల్‌లోని చిట్టగాంగ్ ప్రాంతంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పృథిలత చిన్నతనం నుంచే చదువులో రాణించారు. అలాగే.. సాహిత్యంతో పాటు జాతీయవాద భావజాలంపై మక్కువ పెంచుకున్నారు. ఢాకా, కలకత్తాలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో తత్వశాస్త్రంలో పట్టా పొందిన పృథిలత ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. అయితే, దేశం ఎదుర్కొంటున్న బానిసత్వం ఆమెను నిశ్చలంగా ఉండనివ్వలేదు. ఆ సమయంలోనే చిట్టగాంగ్‌లో విప్లవ జ్వాలలు రగిలిస్తున్న సూర్యసేన్ (మాస్టర్ దా) నాయకత్వంలోని దళం పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. సూర్యసేన్ నేతృత్వంలోని విప్లవ గ్రూపులో చేరిన పృథిలత.. అక్కడ ఆయుధాల వినియోగం, గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ పొందారు. చిట్టగాంగ్ ఆయుధాగార దాడి వంటి సాహసోపేత చర్యల నేపథ్యంలో.. మహిళలను కూడా విప్లవ పథంలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ముఖ్యంగా జాత్యహంకారానికి పరాకాష్టగా నిలిచిన పహార్టలి యూరోపియన్ క్లబ్ లక్ష్యంగా ఆమె సాగించిన పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పహార్టలి యూరోపియన్ క్లబ్ ద్వారం వద్ద భారతీయులకు, కుక్కలకు ప్రవేశం లేదు అనే అవమానకరమైన బోర్డు ఉండేది. ఈ అవమానం భారతీయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండటంతో.. ఆ క్లబ్‌పై దాడి చేయాలని సూర్యసేన్ బృందం నిర్ణయించింది. 1932 సెప్టెంబర్ 23న పృథిలత స్వయంగా ఒక పంజాబీ యువకుడి వేషధారణలో విప్లవ దళానికి నాయకత్వం వహిస్తూ క్లబ్‌పై విరుచుకుపడ్డారు. బాంబులు, కాల్పులతో ఆ భవనాన్ని దెబ్బతీసి బ్రిటిష్ అధికారులను హడలెత్తించారు. ఈ ఆకస్మిక దాడిలో బ్రిటిష్ సైన్యం పృథిలతను చుట్టుముట్టింది. పోలీసులకు సజీవంగా చిక్కితే విప్లవ రహస్యాలు బయటపడతాయని, చిత్రహింసలకు గురికావాల్సి వస్తుందని భావించిన ఆమె.. ముందే సిద్ధం చేసుకున్న సైనైడ్ మాత్రను మింగి మరణించారు. బానిసగా బతకడం కంటే అమరత్వం మిన్న అని భావించి.. 21 ఏళ్లకే తన ప్రాణాలను దేశానికి అంకితం చేశారు. ఒక మహిళా విప్లవకారిణి ఇలా ఆత్మహుతికి పాల్పడటం అప్పట్లో బ్రిటిష్ పాలకులను విస్మయానికి గురిచేసింది. పృథిలత చేసిన ఈ త్యాగం భారత మహిళా లోకానికి ఒక దిశానిర్దేశం చేసింది.
అప్పటి వరకు గృహ హింసలు, సామాజిక వివక్షల మధ్య ఉన్న మహిళలు దేశ స్వేచ్ఛ కోసం ఆయుధాలు పట్టగలరని ఆమె నిరూపించింది. నేటి ఆధునిక కాలంలో కూడా ఆమె స్మృతులు సజీవంగా ఉన్నాయి. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయం, బెథ్యూన్ కళాశాల వంటి చోట్ల ఆమె పేరుతో హాస్టళ్లు ఏర్పాటయ్యాయి. ఆమె విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం, విద్యాసంస్థలు ఆమెకు ఘన నివాళులు అర్పిస్తున్నాయి. చరిత్రలో పురుష విప్లవకారుల పేర్లు ప్రముఖంగా వినిపించినా, పృథిలత వంటి వీరనారి పాత్రను విస్మరించలేము. మణిని చటర్జీ వంటి రచయితలు తమ గ్రంథాలలో ఆమె సాహసాన్ని భావితరాలకు వివరించారు. ఆత్మగౌరవం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన ఆమె జీవితం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా సాగిన ఒక గొప్ప పోరాటంగా మిగిలిపోతుంది. పృథిలతా వడ్డేదార్ కేవలం ఒక విప్లవకారిణి మాత్రమే కాదు, భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీక. స్వేచ్ఛా వాయువుల కోసం ఆమె చిందించిన రక్తం వృధా కాలేదు. ఇరవై ఏళ్ల ప్రాయంలోనే ఒక సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆమె ధైర్యం నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఆమె గాథ భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక ఉజ్వలమైన అధ్యాయంగా నిలుస్తుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ నచ్చినట్లైతే https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.


.webp)



