భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాని కొత్త దిశానిర్దేశం!

posted on: May 12, 2026 4:41PM

 ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్‌లో నిలకడలేని ముడి చమురు ధరల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుం బిగించారు. దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పౌరులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.  ఆర్థిక క్రమశిక్షణను ఒక సామాజిక బాధ్యతగా మార్చడం ద్వారానే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను కాపాడుకోగలమని ప్రధాని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు భారీ దిగుమతి బిల్లు. మన దేశం సుమారు 775 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఇతర దేశాల నుండి కొనుగోలు చేస్తోంది. ఇందులో కేవలం ముడి చమురు, పసిడి, వంట నూనెలు. ఎరువుల కోసమే   240 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల కోసం 134.7 బిలియన్ డాలర్లు, బంగారం కోసం 72 బిలియన్ డాలర్లు విదేశాలకు తరలిపోతున్నాయి. మనం వాడే చమురులో 85 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. ప్రజలు తమ వ్యక్తిగత ఇంధన వినియోగంలో కేవలం 10 శాతం పొదుపు చేసినా.. దేశానికి ఏటా 58 వేల కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.   

భారతీయ సంస్కృతిలో భాగమైన బంగారానికి ఉన్న క్రేజ్ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారింది. ప్రపంచంలోనే బంగారంలో రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉన్న ఇండియా..  కేవలం బంగారం కొనుగోలు కోసం భారీ మొత్తాన్ని వెచ్చిస్తోంది. దీనికి తోడు, విదేశీ పర్యటనలు,  విదేశాల్లో నిర్వహించే భారీ వివాహాల (డెస్టినేషన్ వెడ్డింగ్స్) ధోరణి పెరుగుతోంది. గత ఏడాదిలో భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం 17.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. సామాజిక హోదా కోసం చేసే ఇలాంటి ఖర్చులు రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతున్నాయి.  అందుకే పౌరులు  సామాజిక హోదా   కంటే  ఆర్థిక దేశభక్తికి పెద్దపీట వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

 వంట నూనెల దిగుమతిని తగ్గించడం ద్వారా ఆరోగ్యంతో పాటు దేశ సంపదను కాపాడవచ్చని కేంద్రం భావిస్తోంది. అయితే..  ఎరువుల వాడకాన్ని 50 శాతం మేర నియంత్రించాలన్న ప్రధాని ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అంచనాల ప్రకారం, అకస్మాత్తుగా ఎరువులను తగ్గిస్తే ఆహార ధాన్యాల దిగుబడి 35 నుంచి 45 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం  పీఎం-కుసుమ్  పథకం ద్వారా సోలార్ పంపులను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల డీజిల్ వాడకం తగ్గడమే కాకుండా.. ప్రభుత్వానికి ఏడాదికి 1.2 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ భారం కూడా తప్పుతుంది.  

ప్రధాని మోదీ  మేక్ ఇన్ ఇండియా  పిలుపునిచ్చినప్పటికీ..  సాంకేతిక రంగంలో ఇండియా ఇంకా విదేశాలపైనే ఆధారపడుతున్నదన్నది కాదనలేని వాస్తవం.  సెమీకండక్టర్ చిప్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం చైనా, తైవాన్ వంటి దేశాల వైపు చూడాల్సి వస్తోంది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ పెరిగినట్లు కనిపిస్తున్నా, వాటిలోని కీలక భాగాలు దిగుమతి చేసుకున్నవే ఉంటున్నాయి. కాబట్టి, అసెంబ్లింగ్ దశ నుండి పూర్తిస్థాయి తయారీ దశకు చేరుకున్నప్పుడే అసలైన  ఆత్మనిర్భరత సాధ్యమవుతుంది.  

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో, ఇంధన భద్రత,  ద్రవ్యోల్బణాన్ని అదుపు  ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. ప్రధాని మోదీ ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళిక దేశ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అయితే..  దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేటప్పుడు గ్రామీణ ఆర్థిక పరిస్థితులను,  పారిశ్రామిక పరిమితులను దృష్టిలో ఉంచుకోవడం ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. పౌరుల జీవనశైలి మార్పు మరియు ప్రభుత్వ విధానాల సమన్వయమే భారతదేశాన్ని ఆర్థిక సార్వభౌమాధికారం దిశగా నడిపిస్తుంది.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...