నోరు కాస్త అదుపు గురూ...

posted on: Jun 15, 2015 9:17PM


రాక రాక భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి ప్రధానిగా వున్న కాలంలో పాలనా పరంగా కాస్తంత మంచి పేరు సంపాదించుకున్న బీజేపీ ఆ తర్వాత పూర్తిస్థాయి మెజారిటీని పొందలేక చాలాకాలం అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇన్నేళ్ళ తర్వాత నరేంద్ర మోడీ పుణ్యమా అధికారంలోకి వచ్చింది. అయితే అధికారం  వినయాన్ని ఇవ్వాలి. అధికారంలో లేనప్పుడు ఎలా మాట్లాడినా చెల్లుతుంది. అధికారంలోకి వచ్చాక ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం వుంది. ఈ విషయాన్ని కొంతమంది బీజేపీ నాయకులు, బీజేపీ అనుబంధ సంస్థల నాయకులు విస్మరించి తమ నోటిపై తమ అదుపును కోల్పోవడం వల్ల ప్రభుత్వ బాధ్యతలు మోస్తున్న నరేంద్రమోడీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ముఖ్యంగా ఆర్ఎఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ బ్యాక్ గ్రౌండ్ వున్న నాయకులు అయితే ముందూ వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తున్నారు. ఒకరు ఎక్కువమంది పిల్లల్ని కనండంటారు. మరొకరు హిందూ మహిళలు ఎంతమంది పిల్లల్ని కనాలో ఆయనే చెప్పేస్తారు. ఇంకొకరు ముస్లిములు కూడా హిందువులే అంటారు. మరొకాయన మరోరకం స్టేట్‌మెంట్ ఇస్తారు. వీరందరి అంతరార్ధం ముస్లింలకు వ్యతిరేకంగా వుండటం ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇలాంటి నోటిదూకుడు వ్యవహారాల కారణంగా మోడీ ఇబ్బందిపడాల్సి వస్తోంది.

కాశ్మీర్‌లో కొంతమంది పాకిస్థాన్ అనుకూల వర్గాల వారు వుంటారు. వారు అడపా దడపా పాకిస్థాన్ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ వుంటారు. ఇది చట్ట వ్యతిరేకమే అయినప్పటికీ, ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అయితే ఆచితూచి వ్యవహరించడం అనే మాటే తెలియని ప్రవీణ్ తొగాడియా అనే పెద్దమనిషి  కాశ్మీర్‌లో పాకిస్థాన్ జెండాలు పట్టుకున్నవారిని కాల్చిపారేయాలని సెలవిచ్చి మరో వివాదానికి తెర తీశారు. అలా ఎవర్నీ కాల్చిపారేయడం సాధ్యం కాని విషయమే అని ఆయనకు కూడా తెలిసినప్పటికీ అలా స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ఇలాంటి ఇరుక్కుపోయే ప్రకటనలు తమ పార్టీ సభ్యులు, తమ పార్టీ అనుబంధ సభ్యులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మోడీదేనని విమర్శకులు అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...