యోగాంధ్రలో పాల్గొని ఫస్ట్రేషన్ తగ్గించుకో .. జగన్ కు మంత్రి అనగాని సలహా

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగాలేక గంజాయి బ్యాచ్ ను,  ఉన్మాదులను, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లను కలుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్  అన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్లిందన్న ఆయన దానిని తగ్గించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్రలో పాల్గొనాలని సలహా ఇచ్చారు.

 అల్లర్లు సృష్టించడం మాని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి కాస్తయినా మెరుగుపడుతుందన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో  ఫస్ట్రేషన్ లో జగన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారనీ,  చంపేస్తాం, నరికేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీ సైకో బ్యాచ్ చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి చిరునవ్వుతో స్వాగతిస్తున్నారనీ పేర్కొన్నారు. నెలకు ఒక రోజు జనాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తెనాలి వెళ్లి గంజాయి బ్యాచ్ ను పరామర్శిస్తారు.. ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శిస్తారు.. ఏదేదో మాట్లాడతారు.. ఆయన వల్ల పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతారు అని పేర్కొన్న అనగాలి ఇవన్నీ మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్లలో కనిపించే లక్షణాలు అన్నారు.

ఇలాంటి లక్షణాలు  ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ఉండే రోగులకు ఉండే లక్షణాలు అని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో ప్రజా తీర్పుతో  జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే యోగాంధ్రలో పాల్గొంటే ఆయన ఫస్ట్రేషన్ కాస్త అయినా తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.