ఆ లిస్ట్‌లో రోజా పేరు లేదా..?
posted on Aug 5, 2017 5:27PM
.jpg)
2014 ఎన్నికల్లో చాలా స్వల్ప శాతంతో అధికారానికి దూరమైన వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పవర్ దూరమైనా రాష్ట్ర వ్యాప్తంగా స్థిరమైన ప్రజాదరణను దక్కించుకుంది. అయితే తమ అధికారానికి అడ్డుగోడగా మిగిలిపోయిన ఆ కొద్ది గ్యాప్‌ని పూరిస్తే చాలునని పాత తప్పులు పునరావృతం కాకుండా చూసుకునేందుకు..పార్టీ శ్రేణులని సరైన మార్గంలో నడిపించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా రాజకీయ వ్యూహకర్తగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన ప్రశాంత్ కిశోర్‌ను వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు వైసీపీ అధినేత.
జగన్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ అండ్ టీమ్ ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాను స్కానింగ్ చేస్తోంది. సర్వేల మీద సర్వేలు చేసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారి లిస్ట్ రెడీ చేసి జగన్‌కు అందజేసింది. దానితో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో ఒక సమావేశం నిర్వహించారు ప్రశాంత్. ఈ భేటీకి వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కూడా హాజరయ్యారు.
ఆమె మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్న పీకే..ఈ మధ్య మీ స్పీడు బాగా ఎక్కువైంది దానిని తగ్గించుకోవాలని హెచ్చరించారట. మనం వ్యవహరించే తీరు రాజకీయంగా మనకు మేలు చేయాలని కానీ..మీరు మాట్లాడే తీరు వ్యక్తిగతంగా మీకు..పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందన్నారట..అంతేకాదు 2019లో ఖచ్చితంగా గెలుస్తారని జగన్‌కిచ్చిన లిస్ట్‌లో మీ పేరు లేదన్నారట. ఊహించని ఈ షాక్‌తో సమావేశ మందిరంలో నిశ్శబ్ధం ఆవరించిందట..రోజా అయితే చెమ్మగిల్లిన కళ్లతో బయటకు వచ్చేశారని లోటస్‌పాండ్ టాక్. ఈ విషయంలో వాస్తవమెంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతోంది.