మోడీపై పొగడ్తలు.. ఇండియా విధానాలపై విమర్శలు.. ట్రంప్ రెండు నాల్కల ధోరణి

posted on: Jun 5, 2026 10:31AM

ఇండియా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే.. మరో వైపు భారత వాణిజ్య విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఈ రెండు నాలుకల ధోరణి  అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వైట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు  విడదీయరాని మైత్రి ఉందని చెప్పుకొచ్చారు.   మోదీ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడనీ,  ఆయనతో తనకు బలమైన అనుబంధం ఉందనీ చెప్పిన ట్రంప్ ఇరు దేశాలు ప్రస్తుతం ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని, త్వరలోనే ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి వస్తామన్న విశ్వాసాన్ని  వ్యక్తం చేశారు.

అయితే.. ప్రధాని మోడీతో స్నేహాన్ని గురించి చెబుతూ, ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతూనే..   భారత్ గతంలో అనుసరించిన వాణిజ్య విధానాలపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. గతంలో భారత్ భారీ సుంకాలను విధిస్తూ అమెరికాను వాణిజ్యపరంగా పూర్తిగా వాడుకుందన్నారు. ఏళ్ల తరబడి భారత్ అమెరికాను ఒక గొప్ప అవకాశంగా మలుచుకుందని, అమెరికా నుంచి వచ్చే వస్తువులపై భారీగా పన్నులు మోపిందనీ,  దీనివల్ల అమెరికా గతంలో నష్టపోయిందనీ చెప్పుకొచ్చారు.  

ఇప్పుడు కాలం మారిందనీ..  ప్రస్తుతం తాము భారత్‌తో అత్యంత లాభదాయకమైన వాణిజ్యాన్ని సాగిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు.  ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య అడ్డంకులు, సుంకాలు, ఇతర క్లిష్టమైన ఆర్థిక అంశాలపై అమెరికా, భారత ఉన్నతాధికారులు ఇటీవల సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నాలుగు రోజుల పాటు అత్యంత కీలకమైన వాతావరణంలో జరిగిన ఈ చర్చలు సానుకూల ముగింపుకు వచ్చాయి.  ఈ చర్చలు  ముగిసిన అనంతరం వైట్‌హౌస్ నుంచి ట్రంప్ ఈ వ్యాఖ్యలు  ప్రాధాన్యత సంతరించుకుంది.   అమెరికా అధ్యక్షుడి   వ్యాఖ్యలు ఒకే సమయంలో  వ్యూహాత్మక మైత్రిని, వాణిజ్య వైరుధ్యాన్నీ చాటడంపై పరిశీలకులు ఆక్షేపిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...