అధికారం జగన్ కు సూట్ అవ్వదు.. పాదయాత్ర వల్ల ఫలితం ఉండదు.. షర్మిల
posted on: Jan 30, 2026 11:51AM
.webp)
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది. స్వయంగా వైసీపీ శ్రేణులలోనే ఆయన ప్రకటన పట్ల ఒకింత ఆందోళన వ్యక్తమౌతోంది. గత ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఏపీకి చుట్టపు చూపుగా వచ్చి బెంగళూరులోనే తిష్ఠ వేసిన ఆయన ఈ మధ్య కాలంలో పలు ప్రకటనలు చేశారు. జిల్లాల పర్యటన నుంచీ, కార్యకర్తలతో వరుస భేటీల వరకూ ఎన్నో ప్రకటనలు చేశారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు.
వీలు కుదిరినప్పుడు బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి.. ప్రెస్ మీట్లతో ఆయన తన రాజకీయాన్ని సరిపెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో పార్టీ శ్రేణులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. సరే అది పక్కన పెడితే ఈ సారి ఆయన ఏకంగా పాదయాత్ర 2.0 ప్రకటించేశారు. ఈ ప్రకటన కూడా గతంలో ఆయన ప్రకటించిన జిల్లాల యాత్రల మాదిరిగా ప్రకటనకే పరిమితమైతే.. రాష్ట్రంలో పార్టీ గురించి ఇక మర్చిపోక తప్పదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
అది పక్కన పెడితే జగన్ పాదయాత్ర ప్రకటనపై నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్రలో అడుగుకొక హామీ చొప్పున ఇచ్చారు. ఆ పాదయాత్ర పుణ్యమా అని 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీల అమలు సంగతి అటుంచి.. పాలన అంటే వేధింపులు, రాజకీయ కక్ష సాధింపే అన్నట్లుగా జగన్ వ్యవహరించిన తీరుతో విసిగిపోయిన ఏపీ జనం ఆయనను అధికారం నుంచి దింపేశారు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ పాదయాత్ర ప్రకటనను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జగన్ కు స్వయానా సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ పాదయాత్ర ప్రకటనపై పెదవి విరిచారు. జగన్ పాదయాత్ర అధికారం కోసమేనన్నారు. అయితే ఒక సారి అధికారం వెలగబెట్టి ఆయన చేసిందేమిటని ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజా శేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేస్తానని చెప్పి అసలు పట్టించుకున్నారా? మధ్యపాన నిషేధం చేస్తానన్న జగన్ ఆ మాట పూర్తిగా మర్చిపోయి.. మద్యం మాఫియాను నడిపారని నిప్పులు చెరిగారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ప్రజలను పూర్తిగా మరిచిపోయారన్న షర్మిల.. ఇప్పుడు జనం ఆయనను మర్చిపోయారన్నారు. పవర్ జగన్ రెడ్డికి సూట్ అవ్వలేదన్నారు. ఎప్పుడో 2027 లో చేయబోయే పాదయాత్రకు ఇప్పుడు ప్రకటన ఎందుకని ప్రశ్నించారు. పాదయాత్ర ప్రకటన అయితే చేసేసిన జగన్ ఆ ప్రకటన మేరకు వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేపట్టే అవకాశాలపై పరిశీలకులు సైతం పెదవి విరుస్తున్నారు. జనానికి జగన్ ఇప్పటికే బాగా దూరం అయ్యారనీ, అధికారం కోల్పోయిన తరువాత రాష్ట్రానికీ దూరం అయిన ఆయనను జనం విశ్వసించే అవకాశాలు అంతంత మాత్రమేననీ అంటున్నారు.






