పవన్ మళ్ళీ "హీరో" అయ్యాడోచ్..!

పవర్‌ కోసం కాదు..ప్రశ్నించడం కోసం అనే ట్యాగ్‌లైన్‌తో జనసేనను స్థాపించారు పవన్ కళ్యాణ్‌‌. కానీ పవన్ అన్న మాటను నిలబెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆయన ప్రశ్నించిన చాలా వాటికి ప్రభుత్వం స్పందించడంతో జనసేనాని జనాల దృష్టిలో హీరోగా నిలిచారు. మొన్నామధ్య ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చలించిపోయిన పవన్ విషయాన్ని తన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఏకంగా హార్వార్డ్ యూనివర్శిటీ వైద్య బృందాన్ని రంగంలోకి దింపి ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మూలాలు గుర్తించి శాశ్వత పరిష్కారం కొనుగొనేందుకు కృషి చేశారు. ఇక అంతే జనసేనానికి ప్రజలు జేజేలు పలికారు..సమస్య ఏదైనా సరే పవన్‌ దగ్గరికి వెళితే న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడిపోయింది.

 

తాజాగా ఏపీలో వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సంబంధించి తమకు అడ్డుగా మారిని జీవో 64ను రద్దు చేయాలని విద్యార్థులు గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో వారు తమ గోడును జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే ఈ జీవోను రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో నిన్న ఆ జీవోను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల విద్యార్థుల అభ్యర్థన మేరకు జీవో 64ను రద్దు చేస్తున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ వివాదంపై త్రిసభ్య కమిటీని నియమించామని..కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

 

ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగడంలో సహకరించిన పవన్‌ను వారు ఆకాశానికి ఎత్తేశారు. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు జనసేనాని. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సమస్యను పరిష్కరించింది గనుక సమ్మె విరమించి తరగతులకు హాజరవ్వాలని విద్యార్థులకు సూచించారు పవన్. మొత్తంగా చూస్తే తాజా ఇష్యూతో పవన్‌కు ప్రభుత్వం వద్ద ఉన్న పరపతి..ఆయనకు చంద్రబాబు సర్కార్ ఇస్తోన్న ప్రాధాన్యత అర్థమవుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu