భారత విదేశాంగ విధానంతో సత్ఫలితాలు!

posted on: Jun 8, 2026 4:11PM

అమెరికా, చైనాలతో పాటు భారతదేశం కూడా తనదైన విదేశాంగ విధానంతో ప్రధాన శక్తిగా ఎదుగుతోంది.  ఇండియాఇప్పుడు ప్రాంతీయ శక్తి కాదు, ప్రపంచ దౌత్య కేంద్రంగా మారింది. ఇండో పసిఫిక్ భద్రతా వ్యవస్థలో కీలక శక్తిగా ఎదిగింది. భారత విదేశాంగం ఇప్పుడు ఉప్పెన దశలో ఉందంటే అది యాదృచ్ఛికం కాదు, నిర్మాణాత్మక మార్పని చెప్పాలి.  విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, వ్యూహాత్మక తటస్థత,   గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహిస్తున్న ఇండియా,  ప్రపంచ దౌత్య కేంద్రంగా ఎదుగుతోంది. బహుళ పక్ష చర్చలు, ఉక్రెయిన్, రష్యా సంక్షోభం, పశ్చిమాసియా పరిణామాలలో భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక స్వతంత్ర విధానం న్యూఢిల్లీని అంతర్జాతీయ శాంతి చర్చలకు కీలక కేంద్రంగా మార్చింది.

భారత్ తన జి 20 అధ్యక్ష పదవి ద్వారా..  ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యదేశంగా చేర్చి..  అణగారిన వర్గాల గొంతుకగా నిలిచింది. అమెరికా, క్వాడ్ దేశాలతో భద్రతా ఒప్పందాలు చేసుకుంటూనే..  రష్యాతో చమురు, రక్షణ సంబంధాలను సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ప్రపంచ దేశాలు రెండుగా విడిపోతున్న ప్రస్తుత తరుణంలో..  విశ్వబంధు గా అవతరించి, వివాదాలను పరిష్కరించే చర్చలలో ఇండియా  కీలకపాత్ర పోషిస్తోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)  రంగాలలో కొత్త ప్రపంచ ప్రమాణాలను నిర్దేశిస్తోంది. 

వియత్నాం  వంటి దేశాధినేతల నుండి లావోస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెనిజులా,  యునైటెడ్ కింగ్ డమ్ దేశాల ఉప ప్రధాన మంత్రులు, విదేశాంగ మంత్రుల వరకు విదేశీ ప్రముఖులు ఢిల్లీలో మోడీ సర్కారుకు అందుకే క్యూ కడుతున్నారు.  అదే సమయంలో, ప్రధానమంత్రి,  విదేశాంగ మంత్రి బహుళ దేశాల పర్యటనలతో ప్రపంచవ్యాప్తంగా చురుకైన దౌత్యాన్ని నడిపిస్తున్నారు. యూరప్–పశ్చిమ ఆసియా యుద్ధాలు, ఇండో–పసిఫిక్ ఉద్రిక్తతల మధ్య భారతదేశం అందరికీ ఒక స్థిరమైన, విశ్వసనీయ భాగస్వామిగా కనిపిస్తోంది.హిందూ మహాసముద్రం రెండు వైపులా భారత ప్రభావం అందుకు దోహదపడుతోంది. 

భారతదేశ విదేశాంగ విధానం శూన్యం నుంచి ఆవిర్భవించింది కాదు. దాని మూలాలు  దేశ చారిత్రక నాగరికత, సంస్కృతి, బ్రిటిష్ విధానాల వారసత్వం, స్వాతంత్ర్య పోరాటం, గాంధీజీ తాత్విక బోధనల్లో కనిపిస్తాయి. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియాలో భారత్‌ది కీలక పాత్ర. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మన దేశం అసియా ఖండానికి వంతెనలా వ్యవహరిస్తుంది.  జాతి ఆధారంగా వ్యక్తుల పట్ట వివక్ష చూపడాన్ని భారతదేశం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. మన దేశ విదేశాంగ విధానం సామ్రాజ్యవాదాలకు పూర్తిగా వ్యతిరేకం. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నేటి పీఎం మోడీ వరకు ప్రతి పాలకుడు మన విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో తమదైన పాత్ర పోషించారు. గత ఎనిమిదేళ్లలో మోడీ భారత విదేశాంగ విధానానికి అద్భుతమైన చైతన్యాన్ని, శక్తిని అందించారు. ఆయన అనేక దేశాలను సందర్శించారు, ప్రపంచ నాయకులతో పలుమార్లు సంభాషించారు.భారత విదేశాంగ విధానంలో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టారు. చురుకైన దౌత్య సహకారంతో, భారతదేశ ప్రపంచ ప్రతిష్టను పెంచడంలో విదేశాంగ విధానం కీలక పాత్ర పోషించింది. మేక్-ఇన్-ఇండియా , త్మనిర్భర్ భారత్ వంటి భారతదేశ దేశీయ ప్రాధాన్యతలను నెరవేర్చడానికి విదేశాంగ విధానం ఒక సాధనంగా ఉపయోగపడింది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...