అన్ని పార్టీలలో ఎన్నికళలు!
posted on Apr 9, 2014 7:08AM
.png)
రాష్ట్రంలో ఈనేలో 30న జరిగే మొదటిదశ ఎన్నికలకి నామినేషన్లు వేయడానికి ఈరోజే ఆఖరి రోజు. అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్ధులను దాదాపుగా ప్రకటించినప్పటికీ, ముఖ్యమయిన కొన్ని స్థానాలపై ఇంకా పట్లుపడుతూనే ఉన్నాయి. అన్ని పార్టీలలో కూడా టికెట్ దొరకని నేతలు, వారి అనుచరులు వీరంగం వేస్తున్నారు. కొందరు చురుకయిన నేతలు చకచకా కండువాలు, టోపీలు, పార్టీలు మార్చేసి టికెట్స్ దక్కించుకొంటే, మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. అయితే ‘నామినేషన్ల ఉపసంహరణ’ అనే వెసులుబాటు అటువంటివారిని బుజ్జగించి బరిలోనుండి తప్పించేందుకే ఉంది కనుక అప్పటికి అన్ని పార్టీలలో చెలరేగిన అశాంతి కొంతవరకు సర్దుమణగవచ్చును. కానీ పొత్తుల్లో భాగంగా టికెట్ దొరకని తమ పార్టీ నేతలని సదరు పార్టీలే స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగేందుకు పరోక్షంగా ప్రోత్సహించి, వారిపై బహిష్కరణ వేటు కూడా వేసి, ఎన్నికలలో గెలిచిన తరువాత ఆ బహిష్కరణ ఎత్తివేసి తిరిగి పార్టీలోకి రప్పించుకోవడం గతంలోనే చాలాసార్లు జరిగింది. గనుక రాజకీయ పార్టీలు, వాటిని వదిలి వెళ్ళిన లేదా పార్టీల గోడలు దూకి టికెట్ సాధించుకొన్న అభ్యర్ధులు అందరూ ఒక తానులో ముక్కలేనని స్పష్టమవుతోంది. అన్ని పార్టీల, నేతల ఏకైక లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకోవడమే తప్ప వేరేమి కాదని వారి ఈ చేష్టలే నిరూపిస్తున్నాయి. ఇంతకాలం ప్రజలను చైతన్యపరిచేందుకు యాత్రలు చేసిన సదరు నేతల ఆలోచనలు, పద్దతులలో ఎన్నడూ మార్పు రాబోదని, ప్రజలు అటువంటివి ఆశించడం అత్యాశే అవుతుందని నిరూపిస్తున్నారు. అందువల్ల ప్రజలు కూడా ఇవ్వన్నీ ప్రతీ ఎన్నికల ముందు కనబడే సర్వ సాదారణ దృశ్యాలే అని సరిబెట్టుకొని వారిలోనే ఎవరికో ఒకరికి ఓటేసి వస్తుంటారు.