పొత్తులతో బలాబలాలు మార్పులు

 

తెదేపా-బీజేపీ-జనసేన-లోక్ సత్తాల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారయినట్లయితే, సీమాంద్రాలో ఆ నాలుగు పార్టీలు బలమయిన కూటమిగా ఏర్పడి, వేర్వేరుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్, వైకాపా, జైసపాలను బలంగా డ్డీ కొనవచ్చును. ఇంతవరకు వైకాపా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కానీ మజ్లిస్, సీపీయం పార్టీలు దానితో పొత్తులు పెట్టుకోవాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొన్నట్లయితే వారి కూటమికి కూడా కొంత బలపడుతుంది. అప్పుడు కాంగ్రెస్, జైసపాలు ఈ రెండు కూటములను ఎదుర్కొని నిలవలసి ఉంటుంది. అయితే జైసపా, వైకాపాలు రెండూ కూడా ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం లేదా ఆ పార్టీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున వాటిని కాంగ్రెస్ అనుబంధ పార్టీలుగానే పరిగణించవలసి ఉంటుంది.

 

తెదేపా కూటమికి చాలా ప్లస్ పాయింట్స్ కనబడుతుంటే, వైకాపా కూటమికి మాత్రం కొన్నే కనబడుతున్నాయి. తెదేపా కూటమిలో చంద్రబాబు, నరేంద్ర మోడీ, జయప్రకాశ్ నారాయణ్ వంటి అనుభవజ్ఞులయిన నేతలు, పవన్ కళ్యాణ్ వంటి మంచి ప్రజాధారణ ఉన్న నటుడు కనబడుతుంటే, వైకాపా కూటమిలో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ప్రత్యర్ధులతో పోల్చి చూస్తే చాలా విషయాలలో తేలిపోతారు.

 

ఒకవేళ వైకాపాకి మజ్లిస్ కూడా తోడయితే, ముస్లిం, క్రీస్టియన్ ఓట్లన్నీ వారికే పడవచ్చును. అయితే, బీసీ, యస్సీ, ఎస్టీలు, ఇతర కులస్తులు అందరూ తెదేపా లేదా కాంగ్రెస్ పార్టీల వైపు మొగ్గు చూపవచ్చును. కానీ రాష్ట్ర విభజన చేసినందుకు తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారందరూ కూడా విజయవకాశాలున్న బీజేపీతో పొత్తులు పెట్టుకొంటున్న తెదేపాకే ఓటేయవచ్చును. ఈసారి ఎన్నికలలో తెదేపా బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగా చేస్తోంది. ఇక కాంగ్రెస్ నుండి భారీగా తరలి వస్తున్న హేమాహేమీల వలన కూడా తెదేపా మరింత బలోపేతమవుతుంటే, అదే కారణంతో వైకాపా వారి ముందు బలహీనంగా కనబడుతోంది.

 

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినప్పటికీ, ఇంకా ఆ పార్టీలో హేమహేమీలనదగ్గ నేతలు మిగిలే ఉన్నారు. వారందరూ పార్టీ విజయానికి భరోసా ఇవ్వలేకపోయినా వారు మాత్రం ఎన్నికలలో గెలవగల సత్తా ఉన్నవారే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని చోట్ల మిగిలిన పార్టీలకు గట్టిపోటీ ఇవ్వగలదు. అయితే పోటీ ప్రధానంగా తెదేపా కూటమికి వైకాపాకి మధ్యనే ఉండవచ్చును.