కవిత వర్సెస్ బీఆర్ఎస్.. రాజకీయ యుద్ధం ముదిరిందిగా?

posted on: Mar 2, 2026 1:25PM

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో పులుక‌డిగిన ముత్యంలా తిరిగి వ‌స్తానంటూ.. క‌విత చేసిన వ్యాఖ్య‌లు  ఢిల్లీ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో నిజమయ్యాయనే చెప్పాలి.  అయితే.. మ‌ద్యం కేసులో నిందితురాలిగా కవిత ఉండటం వల్లే  బీఆర్ ఎస్ 2023 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైందంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి  కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనాన్ని తగ్గించాయని పరిశీలకులు అంటున్నారు. కవిత సైతం  త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు.

దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.  అప్పట్లో  అంటే క‌విత అరెస్టు అయినప్పుడు మంత్రులుగా ఉన్న కేటీఆర్‌, హ‌రీష్‌రావు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న చేయ‌డం.. క‌విత జైల్లో ఉన్న‌ప్పుడు.. ఆమెను క‌లుసుకునేందుకు గంట‌ల కొద్దీ వెయిట్ చేయ‌డం.. వంటి వీడియోలను సోష‌ల్ మీడియాలో  పోస్టు చేస్తూ బీఆర్ఎస్ అప్పట్లో కవితకు అండగా నిలిచిందని చెప్పుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నది. 

అలాగే బీఆర్ఎస్ అధినేత‌, అప్ప‌టి సీఎం కేసీఆర్ అప్పట్లో మీడియాతో  మాట్లాడుతూ క‌విత‌పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించార‌ని.. త‌న‌పై ఉన్న అక్క‌సును త‌న కుమార్తెపై  తీర్చుకుంటున్నార‌ని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బైట్లనూ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు.   అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసినదేమిటంటే.. కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో క్లీన్ చిట్ ఇస్తూ  తీర్పు వెలువడిన తరువాత బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించాలి.. కానీ అందుకు భిన్నంగా కవితకు తాము అప్పట్లో అండగా నిలబడ్డామని చెప్పుకోవడానికే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

కవిత కాదన్నా సరే.. వారు అదే పాట పాడుతున్నారు. కేవలం కవిత అప్పట్లో తనకు పార్టీ అండగా నిలవలేదని చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టేందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా తన పేజీలన్నిటినీ నింపేస్తున్నది. దీనిని బట్టి చూస్తుంటే కవిత బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదిరిందని అవగతమౌతోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్   ఇప్పుడు కవిత ఫియర్ తో వణికిపోతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...