హుక్కా సెంటర్‌పై పోలీసుల దాడి.. 38 మంది అరెస్ట్ హుక్కా సెంటర్ పై పోలీసుల దాడి.. 38 మంది అరెస్టు
posted on: Mar 17, 2026 9:42AM

హైదరాబాద్లో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ హుక్కా సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.
రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత గోప్యంగా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం (మార్చి 16) రాత్రి నిర్వహించిన దాడిలో యువకులు హుక్కా తాగుతూ పట్టుబడ్డారు. ఈ దాడిలో వివిధ రకాల నిషేధిత హుక్కా ఫ్లేవర్లు, పొగాకు మిశ్రమాలు, పైపులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హుక్కా కేంద్రం నిర్వాహకులుగా భావిస్తున్న సాగర్, మోహన్ లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నగరంలో యువతను పెడదోవ పట్టిస్తూ, ఆరోగ్యానికి హాని కలిగించే ఇటువంటి అక్రమ హుక్కా కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు స్పష్టం చేశారు. . హుక్కా పేరుతో కేవలం పొగాకు మాత్రమే కాకుండా, ఇతర మత్తు పదార్థాలు కూడా సరఫరాచేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.






