జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు.. కోర్టులో పోలీసుల పిటిషన్
posted on: Feb 3, 2026 10:02AM
.webp)
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు నకిలీ మద్యం కేసులో మంజూరైన బెయిలు రద్దు చేయాలని కోరుతూ పోలీసులు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సోమవారం (జఫిబ్రవరి 2) పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములుకు ఇటీవల షరతులతో కూడిన బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే.
అయితే బెయిలుపై విడుదలైన నాటి నుంచీ వీరిరువురూ బెయిలు షరతులను ఉల్లంఘిస్తున్నారనీ, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారనీ పేర్కొంటూ పోలీసులు వారి బెయిలు రద్దు కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించకుండా, సాక్షులను ప్రభావితం చేస్తున్నారనీ, దర్యాప్తును తప్పదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనీ పోలీసులు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా జోగి రమేష్, జోగి రాములు బెయిలుపై విడుదలైన తరువాత రాజకీయ విద్వేషాలు పెచ్చరిల్లేలా వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉంటూ కూడా ఇలా వ్యవహరించడం ద్వారా తప్పుడు సంకేతాలు పంపుతూ, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అలా వ్యవహరించిన వారి బెయిలు రద్దు చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ కోణంలోనే పోలీసులు జోగి బ్రదర్స్ బెయిలు రద్దు కోరుతూ వారి రెచ్చగొట్టే ప్రసంగాలను కోర్టుకు సమర్పించారు. ఇప్పుడు పోలీసుల బెయిలు రద్దు పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించి బెయిలు రద్దు చేస్తూ జోగి సోదరులకు కటకటాలు తప్పదని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.


.webp)



