న్యాయవాది హత్య కేసులో పోలీసులు సీన్ రీ-కన్స్ట్రక్షన్

posted on: May 28, 2026 3:16PM

 

న్యాయవాది హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కేసులో కీలక ఆధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించి ఘటన జరిగిన తీరును పునర్నిర్మించారు.

విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. తనపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకు ఓ రాజకీయ నాయకుడు న్యాయవాదికి భారీ మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రూ.40 కోట్ల వరకు ఇవ్వాలని ప్రయత్నించినట్టు విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

మల్లెపల్లి, లకడికాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లోని వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారాల్లో కేసులు వేయవద్దని, బోర్డులోని కీలక పదవుల జోలికి రావద్దంటూ ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం. భూముల వ్యవహారాల్లో తమ ప్రమేయాన్ని బయటపెట్టవద్దంటూ కొందరు రాజకీయ నాయకులు న్యాయవాదిని బెదిరించిన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇక హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న మహేంద్ర స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే వాహనంలో నిందితుడు అభిజిత్ వినయ్‌ను తీసుకెళ్లి సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఘటన సమయంలో వాహనం ఎంత వేగంతో నడిపారన్న అంశాన్ని కూడా పోలీసులు రికార్డు చేసినట్లు సమాచారం.

ఈ కేసులో కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలు, భూముల వివాదాలు తదితర అంశాలపై ప్రత్యేక బృందాలు పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...