Latest News

ఖాజీపేటలో ఎర్ర స్మగ్లర్ల అరెస్టు

posted on: Mar 22, 2026 9:43PM

అటవీ సంపదను కొల్లగొడుతూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించారు ఖాజీపేట పోలీసులు.   కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లె అటవీ సరిహద్దుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఎర్రచందనం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆపరేషన్‌లో లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని   ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. 

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.   నాగసానిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.  అయితే  పోలీసుల రాకను గమనించిన స్మగ్లర్లు తప్పించుకునే ప్రయత్నంచేసినా ఫలితం లేకపోయింది.  వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు ఎనిమిది మందిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి లక్షల రూపాయల విలువ చేసే 17 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నారు.  పరారైన మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.   ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపిన పోలీసులు అటవీ సంపదను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే  వదిలిపెట్టేది లేదనీ స్పష్టం చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...