మళ్ళీ మొదటికొచ్చిన పోలవరం

posted on: Jun 24, 2014 9:46PM

 

ఆంధ్ర, తెలంగాణా శాసనసభలు పోలవరం ముంపు గ్రామాలపై పరస్పర వ్యతిరేఖ తీర్మానాలు ఆమోదించడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు వెనక్కి తగ్గకపోవడంతో, కేంద్రం మళ్ళీ జోక్యం చేసుకోక తప్పనిసరి అవుతోంది. అయితే కేంద్రం స్వయంగా ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్వయంగా చేపడుతోంది గనుక, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కంటే కేంద్రం మీదనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై ఎట్టి పరిస్థితుల్లో ముందుకే సాగాలని కేంద్రం నిర్ణయించుకొన్నందున, తెలంగాణా అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోకపోవచ్చును. అదే జరిగితే తెరాస ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేఖిస్తున్న ఓడిషా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల మద్దతు కూడగట్టె ప్రయత్నం చేయవచ్చును. కానీ ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది గనుక, తెరాసకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కనుక తెరాస మళ్ళీ ఒంటరి పోరాటం చేయక తప్పదు. ఇంతవరకు మన దేశంలో అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు. వాటివల్ల చాలామంది ప్రజలు నిర్వాసితులయినప్పటికీ, అవి దేశాన్ని సస్యశ్యామమలం చేస్తున్నాయి. ఆ ప్రాజెక్టులకి కూడా ఎంతో కొంత స్థానిక ప్రజల నుండి వ్యతిరేఖత ఎదురయ్యే ఉంటుంది. కానీ వాటినన్నిటినీ అధిగమించి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ అడ్డంకులన్నిటినీ అధిగమించి పోలవరం ప్రాజెక్టు కట్టవలసి ఉంటుంది. మోడీ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయవచ్చును.

google-ad-img
    Related Sigment News
    • Loading...