పోలవరంపై కాంగ్రెస్ ద్వంద వైఖరితో మరింత నష్టపోనుందా?

posted on: Jul 11, 2014 9:04AM

 


 

పోలవరం విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంబిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో గత యూపీయే ప్రభుత్వమే పోలవరం ప్రతిపాదనను విభజన బిల్లులో చేర్చి, ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేందుకు ఆర్డినెన్స్ కూడా తయారుచేసినప్పటికీ, ఆ పార్టీకి చెందిన వీ.హనుమంత రావు వంటి సీనియర్లు, ఒడిష, ఛత్తిస్ ఘర్ మరి కొన్ని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ యంపీలు తెరాసతో చేతులు కలిపి బిల్లును వ్యతిరేఖించేందుకు సిద్దపడుతుంటే వారిని కాంగ్రెస్ అధిష్టానం వారించే ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా పార్లమెంటులో పోలవరం బిల్లుకి మద్దతు తెలుపకుండా అలాగని వ్యతిరేఖించకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకొని ద్వంద వైఖరి అవలంభిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి వల్ల రెండు ప్రాంతాలలో తీవ్రంగా నష్టపోయింది.అందుకు ఇప్పుడు తాపీగా పశ్చాతాపపడుతోంది కూడా. అయినప్పటికీ పోలవరం విషయంలో కూడా మళ్ళీ అదే విధంగా ద్వందవైఖరి అవలంభిస్తూ ఆంధ్ర, తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురికాబోతోంది. కాంగ్రెస్ పార్టీ పోలవరానికి సభలో మద్దతు తెలుపకపోతే, తెలంగాణాలో తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేయడం తధ్యం. దానివల్ల అక్కడి ప్రజలకు కాంగ్రెస్ తెలంగాణా ప్రయోజనాలు కాపాడటం లేదనే అభిప్రాయం మరింత బలపడవచ్చును. అదేవిధంగా పోలవరం ప్రతిపాదనను  స్వయంగా విభజన బిల్లులో పొందుపరిచి, దానిని ఆమోదింపజేసి, తీరా చేసి ఇప్పుడు మద్దతు తెలుపకుండా సభలో వెనుకడుగు వేస్తే కాంగ్రెస్ పార్టీపై ఆంద్ర ప్రజలు మరింత ఆగ్రహించడం ఖాయం. 125సం.ల సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ పోలవరం విషయంలో నిశ్చితాభిప్రాయం ప్రకటించ లేకపోవడం వలన తనకు రెండు ప్రాంతాలలో మరింత నష్టం జరుగాబోతోందనే విషయం గ్రహించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...