భోగాపురంలో భారీ భద్రతా వలయం...ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు..!

posted on: Jul 31, 2026 9:23PM

 

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 1న విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా బహుళస్థాయి భద్రతా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన ఆయన.. అక్కడి నుంచి భద్రతా పర్యవేక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ నిర్వహణ, జనసందోహం కదలికలను పర్యవేక్షించే విధానాన్ని పరిశీలించారు.

ప్రధాని పర్యటన సందర్భంగా సుమారు 3 వేల సీసీ కెమెరాలతో విస్తృత నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయ టెర్మినల్‌ భవనం, సభా ప్రాంగణం, పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలపై కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. క్రౌడ్‌, ట్రాఫిక్‌, పార్కింగ్‌ పరిస్థితులను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా టెర్మినల్‌ భవనంతో పాటు సభా ప్రాంగణం, థింసా నృత్య వేదిక, ఇతర కీలక ప్రాంతాలను పరిశీలించారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి వచ్చే ప్రతి సందర్శకుడిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సభా ప్రాంగణంలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాని కార్యక్రమం ముగిసిన అనంతరం పెద్ద సంఖ్యలో ప్రజలు, వాహనాలు ఒకేసారి బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డీజీపీ సూచించారు. జాతీయ రహదారిపై వాహనదారులకు ముందుగానే మార్గదర్శనం అందేలా పెద్ద సైజు సైనేజీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
భద్రతా విధుల్లో పాల్గొనే సీనియర్‌ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ బందోబస్తును పకడ్బందీగా నిర్వహించాలని డీజీపీ స్పష్టం చేశారు. 

ఎక్కడా సమన్వయ లోపం లేకుండా ప్రతి విభాగం తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు, భద్రతా విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.

PM Narendra Modi, Bhogapuram Airport Inauguration, Alluri Sitarama Raju International Airport, 
AP Development Projects, Visakhapatnam Semiconductor Plant, PM Modi AP Visit Schedule, CM Chandrababau

google-ad-img
    Related Sigment News
    • Loading...