ప్రధాని మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! 

posted on: Feb 4, 2021 9:47AM

బీజేపీ, కాంగ్రెస్ .. ఈ రెండు పార్టీల మధ్య తేడాలేంటని ఎవరిని అడిగినా  వెంటనే చెప్పే సమాధానం వారసత్వ రాజకీయం. కాంగ్రెస్ పార్టీపై  మొదటి నుంచి ఉన్న ఆరోపణలు కుటుంబ రాజకీయాలే.  కాంగ్రెస్ పార్టీలో  హైకమాండ్ నుంచి గ్రామ  స్థాయి వరకు ఎక్కువగా ఇదే కనిపిస్తుంది. నేతల కుటుంబ సభ్యులకే ఆ పార్టీలో ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి. కాని బీజేపీలో మాత్రం వారసత్వ రాజకీయాలకు తావుండదు. అక్కడక్కడ ఉన్నా చాలా తక్కువ. బీజేపీలో అగ్ర నేతలుగా వెలిగిన అద్వానీ, జోషి కుటుంబ సభ్యులెవరు ఇప్పుడు రాజకీయాల్లో లేరు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటివరకు పాలిటిక్స్ లో ఎవరూ లేరు. ఇదే ఆయనకు బలమని కూడా చెబుతుంటారు. 

గుజరాత్‌ బీజేపీలో మాత్రం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ  కూతురు సోనాల్ మోడీ బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అహ్మదాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తనకు నామినేషన్ దాఖలు చేసేందుకు అర్హత ఉందని.. అయితే ప్రధాని మోడీకి బంధువుగా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని ఆమె చెబుతున్నారు. నిజాయతీ కలిగిన బీజేపీ కార్యకర్తగా మాత్రమే తాను పోటీ చేయాలనుకుంటున్నానని సోనాల్ మోడీ స్పష్టం చేశారు.  

 సోనాల్ మోడీ  అహ్మదాబాద్‌లో ఓ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గుజరాత్ కిరాణా దుకాణ సముదాయాల సంఘానికి ఆమె  ప్రెసిడెంట్ గా ఉన్నారు.  అహ్మదాబాద్‌లోని బోడక్‌దేవ్ వార్డు రిజర్వేషన్‌లో భాగంగా మహిళకు కేటాయించారు. దీంతో అక్కడి నుంచి పోటీకి ఆమె సిద్ధమవుతున్నారు. అయితే గుజరాత్ బీజేపీ ఇటీవలే ఓ ప్రకటన చేసింది. పార్టీ టికెట్ కోసం ప్రయత్నించే బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తల బంధువుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునేది లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో  ప్రధాని మోడీ సోదరుడి కుమార్తె అభ్యర్థనపై ఏం చేస్తాకరన్నది ఆసక్తిగా మారింది. 
   
 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న తన కుమార్తె నిర్ణయాన్ని ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ సమర్థించారు. తన కుటుంబ సభ్యులకు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. తామంతా ఎవరికి వారు.. సొంతంగా కష్టపడి సంపాదిస్తున్నామని, తాను కూడా ఓ రేషన్ షాప్ నిర్వహిస్తున్నానని ప్రహ్లాద్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన ఉంటున్న నివాసానికి కూడా తాను ఇప్పటిదాకా వెళ్లలేదని తెలిపారు. మొత్తానికి  సోనాల్ మోడీ పోటీ గుజరాత్ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. సోనాల్  పోటీ చేస్తే.. విపక్షాలు కూడా ప్రధాని మోడీని టార్గెట్ చేయడానికి దీన్ని అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...