ఇరాన్‌పై దాడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

posted on: Mar 17, 2026 3:36PM

 

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన ఇజ్రాయెల్ పర్యటన, ఆ వెంటనే ఇరాన్‌పై జరిగిన క్షిపణి దాడుల చుట్టూ జరుగుతున్న ప్రచారానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం తెరదించింది. ప్రధాని మోదీ పర్యటనకు, ఇరాన్‌పై తాము జరిపిన సైనిక చర్యకు ఎలాంటి సంబంధం లేదని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఈ రెండు వేర్వేరు అంశాలని, వీటిని ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో రూవెన్ అజర్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రధాని పర్యటన కంటే ముందు నుంచే ఉన్నాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారని, ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకున్న రెండు రోజుల తర్వాతే ఇరాన్‌పై దాడులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సైనిక పరంగా లభించిన ఒక అనుకూలమైన అవకాశాన్ని  బట్టి ఈ దాడులు జరిగాయే తప్ప, ఇందులో ముందస్తు ప్రణాళిక లేదని ఆయన వివరించారు.

ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఫిబ్రవరి 28వ తేదీన ఆమోదం తెలిపిందని, ఆ వెంటనే అమెరికాతో కలిసి సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అజర్ తెలిపారు. మోదీ పర్యటన సమయంలో కేవలం ప్రాంతీయ అభివృద్ధి, ద్వైపాక్షిక సంబంధాల గురించి మాత్రమే చర్చలు జరిగాయని, దాడులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఆ సమయానికి దాడులపై స్పష్టమైన నిర్ణయమే లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తూ.. తమ లక్ష్యం ఇరాన్‌ను ఆక్రమించడం కాదని, కేవలం ఆ దేశం నుంచి పొంచి ఉన్న అణు మరియు క్షిపణి ముప్పును అడ్డుకోవడం మాత్రమేనని రాయబారి తెలిపారు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని, ప్రస్తుత దాడులు కేవలం సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేసినవి మాత్రమేనని ఆయన వివరించారు.

ప్రధాని మోదీ పర్యటనను విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ రాయబారి ఇచ్చిన ఈ క్లారిటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన ముగిసిన వెంటనే దాడులు జరగడం వల్ల కొన్ని రాజకీయ వర్గాలు దీనిపై అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే వ్యూహాత్మక ప్రయోజనాలు, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగానే దాడుల సమయాన్ని నిర్ణయించామని రాయబారి పునరుద్ఘాటించారు.

ముందుముందు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు భారత్ వంటి దేశాల సహకారం ఎంతో అవసరమని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్‌తో ఉన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలంటే ఆ దేశం తన దూకుడు వైఖరిని మార్చుకోవాలని రూవెన్ అజర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం కూడా పశ్చిమాసియా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...