మోడీ నియంత్రణ కోల్పోతున్నారా..!


పాపం.. ప్రధాని మోడీకి తన గ్రాఫ్ పడిపోతుండటంతో.. టెన్షన్ బాగా పెరిగిపోయినట్టుంది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా తన మీద వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేకపోతున్నట్టున్నారు. అందుకే కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాల్లో తడబడుతున్నట్టున్నారు. ఇప్పటికే జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అంటూ తమకి ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని సామాన్య ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని బుక్కయ్యారు. అదేంటంటే... నకిలీ వార్త రాస్తే జర్నలిస్టుల గుర్తింపు (అక్రెడిటేషన్‌) రద్దు చేస్తామని ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇక అంతే ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున  దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ సందర్భంగా ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గౌతమ్‌ లాహిరి మాట్లాడుతూ.. పత్రికలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదని.. నకిలీ వార్తలపై ఫిర్యాదులుంటే ప్రెస్‌ కౌన్సిల్‌ చూసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

దీంతో ఇప్పటికే పరిస్థితి దారుణంగా ఉందని గ్రహించిన మోడీ... ఫేక్ న్యూస్ కట్టడి ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్నారు. ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  పీఎంవో సూచన మేరకు ఈ వివాదాస్పద ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

ఇక ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా... ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శిద్దామా అని చూసే ప్రతిపక్షాలకు మంచి పాయింట్ దొరికింది. ఫేక్ న్యూస్ ఆదేశాలను మోడీ వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ముఖ్యంగా మోడీ అంటేనే ఒంటి కాలిపై లేచే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ నిర్ణయంపై స్పందిస్తూ.. ఫేక్ న్యూస్ ఆదేశాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతాయని గ్రహించిన మోదీ సొంత ఆదేశాలపై యూటర్న్ తీసుకున్నారని కామెంట్ విసిరారు. ప్రభుత్వంపై మోదీ నియంత్రణ కోల్పోతున్నారన్న విషయం దీంతో తేటతెల్లమైందని విమర్శించారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..  ఏ మార్గం లేకపోవడం వల్లే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని.. నిత్యం ఓ రాజకీయ పార్టీ ప్రచారం చేస్తున్న ఫేక్‌న్యూస్ సంగతి ఏమిటి? అని పేరు ప్రస్తావించకుండా బీజేపీపై మండిపడ్డారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా దీనిపై స్పందిస్తూ.. ఫేక్‌న్యూస్ ముసుగులో తనకు నచ్చని కథనాలపై ప్రభుత్వం దాడి చేసే అవకాశమున్నదని విమర్శించారు. ఏది ఏమైనా ఒకప్పటి మోడీకి ఇప్పటి మోడీకి చాలా తేడా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు నియంతలా నామాటే వేదం.. నా మాటే శాసనం అన్నట్టు వ్యవహరించిన ఈయన.. ఇప్పుడు కాస్త మెత్తబడ్డారు. అందుకే వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఏం చేస్తారు మరి.. అప్పటిలాగా వ్యవహరిస్తే ఇప్పుడు వర్కవుట్ కాదు కదా.. ఎందుకంటే.. ఈ నాలుగేళ్లలో కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు... అలాగే త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి కదా...