ఎన్నికలకు ముందే కిరణ్ పార్టీ ఖాళీ అయిపోనుందా

 

గత ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపిస్తున్నపుడు అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయన పార్టీ కార్యాలయం ముందు బారులు తీరారు. కానీ ఎన్నికల ముగిసిలోగానే అందరూ మళ్ళీ తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు. అయితే ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరునెలలు మీనమేషాలు లెక్కించి మరీ పార్టీని స్థాపిస్తే ఒక్కరు కూడా వచ్చి చేరడం లేదు, పైగా ఉన్నవారే బయటకి వెళ్ళిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆయన వెనుకే తిరిగిన అనేక మంది మంత్రులు తెదేపాలో చేరిపోగా, పార్టీలో ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా కాదు పొమ్మని శైలజానాథ్ కూడా తెదేపాలో చేరేందుకు సిద్దమయిపోతున్నారు. ఇప్పడు కొత్తగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా తెదేపాలోకి మారిపోయేందుకురంగం సిద్దం చేసుకొంటున్నారు. తెలంగాణాకి ముఖ్యమంత్రి కావలనుకొంటున్న కేసీఆర్ తన అనుచరులచేత అందుకు అనుకూలంగా ఏవిధంగా డిమాండ్ చేయించుకొంటున్నారో, అదేవిధంగా పితాని కూడా తెదేపాలో చేరాలని తన అనుచరుల చేత డిమాండ్ చేయించుకొన్న తరువాత, మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలియజేసారు. అంటే, లాంచనంగా కిరణ్ కుమార్ రెడ్డికి గుడ్ బై చెప్పేసినట్లే అనుకోవచ్చును.

 

ఇక కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న రోడ్ షోలకి కూడా జనాలను పోగేయడం చాలా కష్టమవుతోందని సమాచారం. బహుశః ఆయన చెప్పే సమైక్యపాటాలు వినేందుకు ఇప్పుడు ఎవరికీ ఆసక్తి లేకపోవడమే అందుకు కారణం అయ్యుండవచ్చును. పరిస్థితి ఇలాగే కొనసాగితే కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలు జరుగక ముందే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయవలసి వస్తుందేమో..పాపం. కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకయినా ఆయన పార్టీని నడిపించుకోగలిగితే, ఆనక ఏ కాంగ్రెస్ గంగలో కలిపేసుకొన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు, ఆశ్చర్యపోరు కూడా. కానీ, ఆయన తొందరపడి ఎన్నికల ముందే ఆ పనిచేస్తే మాత్రం ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది.