Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు అనుమతి నో.. కోర్టును ఆశ్రయించిన జనసేన
posted on: Jun 2, 2026 11:13AM

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై తమ ముద్ర వేసేందుకు సన్నద్ధమవుతున్న జనసేన పార్టీకి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. మంగళవారం (జూన్ 2) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. ఒకపక్క ఏర్పాట్లన్నీ పూర్తయి, శ్రేణులు ఉత్సాహంగా ఉన్న తరుణంలో పోలీసుల నిర్ణయం ఆ పార్టీ నేతలకు శరాఘాతంగా మారింది.
జనసేన పార్టీ మంగళవారం (జూన్ 2) హైదరాబాద్ సంధ్యా కన్వెన్షన్ వేదికగా ఒక భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నేపథ్యంలో నగరంలో వీఐపీల కదలికలు, ట్రాఫిక్ ఆంక్షలు, శాంతిభద్రతల నిర్వహణ దృష్ట్యా పవన్‌కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీస్ శాఖ చెప్పింది.
దీనిపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇది రోడ్ల మీద నిర్వహించే బహిరంగ సభ కాదని, కేవలం కన్వెన్షన్ హాల్ లోపల నిర్వహించుకునే అంతర్గత సమావేశం మాత్రమేనని స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం.. ఒక క్లోజ్డ్ ప్రాంగణంలో సమావేశం పెట్టుకున్నప్పుడు పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే సరిపోతుందని, దీనికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎలాంటి సరైన, సహేతుకమైన కారణాలు చూపకుండా చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం పోలీసుల ఏకపక్ష ధోరణికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
పోలీసుల సభకు అనుమతి నిరాకరించడంతో జనసేన కోర్టును ఆశ్రయించింది. సమావేశం నిర్వహించుకోవడం తమ ప్రాథమిక హక్కు అని, కేవలం శాంతిభద్రతల సాకు చూపి ఒక హాల్‌లో జరిగే మీటింగ్‌ను ఎలా అడ్డుకుంటారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.






