ఎండ తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : సీఎం రేవంత్

posted on: May 20, 2026 3:00PM

 

గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం..

19 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ...

తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్య‌లో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని సీఎం ఆదేశించారు. 

ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు మొద‌లు జిల్లా ఆసుప‌త్రుల వ‌ర‌కు వైద్యారోగ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వ‌డ‌దెబ్బ‌తో ఎవ‌రైనా ఆసుప‌త్రుల్లో చేరితే త‌గిన వైద్య స‌హాయం అందించాల‌ని సీఎం ఆదేశించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. సాధ్య‌మైనంత వ‌ర‌కు మ‌ధ్యాహ్నం ప్ర‌యాణాలు చేయ‌కుండా ఉండాల‌ని సీఎం సూచించారు. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రానున్న రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్‌, జనగామ, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల మధ్య నమోదవుతాయని, ప్రజలు మధ్యాహ్నం వేళ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో మంగళవారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో అక్కడ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...