Latest News

దొంగలు బాబోయ్.. దొంగలు

posted on: Jan 20, 2026 1:21PM

వరుస చోరీలతో గాజువాక ప్రజలు వణికిపోతున్నారు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారు పాత నేరస్థులా, కాలనీ వాసులా, అంతర జిల్లా నేరస్థులా తెలియక అయోమయంలో ఉన్నారు.  గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 70వ వార్డులో  తాళం వేసి ఉన్న ఇళ్లల్లో  వరుస చోరీలు జరగడం స్థానికులను బెంబేలెత్తిస్తున్నది.  దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు అర్ధరాత్రి డ్యూటీలు చేస్తూ గస్తీ తరుగుతున్నా, పోలీసుల గస్తీ పోలీసులదే, చోరీల దారి చోరీలదే అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   70వ వార్డు ఎల్బి నగర్, శ్రీనివాస్ నగర్, డ్రైవర్స్ కాలనీలో సంక్రాంతికి ఊరు వెళ్లిన ఆరు ఇళ్లలో దొంగలు చొరబడి ఆ ఇళ్లను గుల్ల చేశారు.   ఒకేసారి ఒకే వీధిలో దొంగలు బీభత్సం  సృష్టించారు అంటే పోలీసులు గస్తీ మాటేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.  ఈ మధ్య కాలంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టే పరిస్థితి నెలకొన్న కారణంగా జనం ఈ చోరీల విషయంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికి జంకుతున్నారు.

 70వ వార్డులో ఆదివారం(జనవరి 18) రెచ్చిపోయిన దొంగలు మారోసారి సోమవారం(జనవరి 19)  శ్రీని వాస నగర్ రోడ్డు నెంబర్ -2 లో ఒంటరిగా ఉంటున్న తేజ అనే మహిళ ఇంటి తలుపు విరగగొట్టి చొరబడటానికి ప్రయత్నం చేసారు. ఆమె లోపలి నుంచి గట్టిగా కేకలు వేయడంతో మొదట దొంగలు చంపేస్తాం అని బెదిరించారు.   చుట్టు పక్కల వారు తలుపులు తీయడంతో దొంగలు పారిపోయారు.  ఎల్బి నగర్ చోరీలో రాజాంకు చెందిన కృష్ణారావు ఇంట్లో రెండు తులాల బంగారం 50 తులాలు వెండి, 15000 నగదు పోయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేసారు.

అలాగే  బంగార్రాజు అనే వ్యక్తి విజయనగరం సంక్రాంతికి ఊరు వెళ్ళడానికి పాతగాజువాకలో బస్సు స్టాప్ వద్ద బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ లో ఉన్న పదకొండు తులాల బంగారం చోరీ జరిగింది. సంక్రాంతి సందర్భంగా గాజువాకలో వైజాగ్ షాపింగ్ మాల్ లో రమణ తన కుటుంబ సభ్యులతో షాపింగ్ చేస్తూ బ్యాగ్ ను సెక్యూరిటీ లగ్గేజేలో ఉంచగా,  ఇందిరా కాలనీకి చెందిన ముద్దాడ వాసు అనే వ్యక్తి యాభై వేలు, పదకొండు తులాల బంగారం బ్యాగ్ ఎత్తుకొని పోయాడు. పోలీసులుకి ఫిర్యాదు రావడంతో సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను పోలీసులు పట్టుకొని రిమాండ్ కి తరలించారు. ఏది ఏమైనా దొంగలు అటు పోలీసులుకి, గాజువాక ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.  ఇప్పటికైనా చోరీలను నివారించడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...