Latest News

బుగ్గనపై ఆరోపణలు రుజువైతే పీడీ యాక్ట్...చంద్రబాబు వార్నింగ్

posted on: Mar 9, 2026 8:13PM

 

వైసీపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు వెలుగు చూస్తాయన్న భయంతోనే బుగ్గన సైలెంట్ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా బుగ్గన పాల్పడిన భూ కబ్జాలపై ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతు  ఆ ఆరోపణలు నిజమని తేలితే బుగ్గనపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో చంద్రబాబు పర్యటించి, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.  ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబుకు ఓ రైతు ఫిర్యాదు చేశారు. విచారించి సమస్య పరిష్కరించాలని ఆర్డీవోను సీఎం ఆదేశించారు. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే ఆక్రమణ దారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఓ రైతు భూమిని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తన అనుచరుల పేరుతో మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. 

జగన్ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద లక్షల ఎకరాల భూములను అధికారుల ప్రమేయం లేకుండానే ఇష్టారాజ్యంగా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ముందు పాన్యంలో పాస్ బుక్‌ను చించేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేస్తానని తాను హామీ ఇచ్చానని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశానని తెలిపారు. 

గతంలో తాను రెవెన్యూ మంత్రిగా పని చేశానని.. రెవెన్యూ సమస్యలు, చట్టాలపై పూర్తిగా అవగాహన ఉందని స్పష్టం చేశారు. భూములు ట్యాంపరింగ్ జరగకుండా డిజిటల్ పాస్ బుక్‌లు ఇస్తున్నామని వెల్లడించారు. పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం డిసెంబర్ నాటికి భూ సమస్యలు పరిష్కారిస్తామని మాటిచ్చారు. అనుభవంలో ఉన్న రైతులకు నెలలోపు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తామని చెప్పుకొచ్చారు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకుండా అరగంటలో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...