తుపాకి పట్టి కాల్పులు జరిపిన పవనకల్యాణ్!
posted on Nov 10, 2025 9:41AM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తుపాకి చేతపట్టి కాల్పులు జరిపారు. ఔను నిజమే.. పవన్ కల్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన సందర్భంగా అక్కడి అధికారులతో మాట్లాడారు. ఫైరింగ్ విధి విధానాలు, ఆయుధాల వినియోగం తదితర అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు చెప్పిన విషయాలను అత్యంత ఆసక్తిగా విన్నారు.
ఆ తరువాత ఆయన తుపాకి పట్టి ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత తుపాకి గ్లాక్ 0.45ను ఉపయోగించారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను ఫైరింగ్ చేస్తున్న పిక్చర్ ను కూడా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తాను చెన్నైలో ఉన్న సమయంలో మద్రాస్ రైఫిల్ క్లబ్‌లో సభ్యుడినని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆ పాతరోజులన్నీ గుర్తుకు వచ్చాయంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించడం, ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కాల్చిన కొన్ని రౌండ్లు 'బుల్స్ ఐ'కి అత్యంత సమీపంలో తాకాయి.