అటవీ భూముల కబ్జా నిజమే.. కబ్జాదారుడు పెద్దిరెడ్డే!

ఎంత బుకాయించినా.. చేసిన పాపం దాగదు. నిజం బయటకు వస్తుంది. ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి విషయంలోనూ అదే జరిగింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములను కబ్జా చేశారన్న విషయం వీడియో ఆధారాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బయటపెట్టారు. 

మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి క్రమ ఆక్రమణలు బహిర్గతంచేశారు. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు,  అటవీశాఖ మాజీ  మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అటవీ ప్రాంతంలోని 32.63 ఎకరాల అటవీ భూమి ఆక్రమించారంటూ    డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం పవన్ కల్యాణ్ ఆటవీ ప్రాంతంలో ఏరియల్ సర్వే జరిపిన వీడియోను విడుదల చేసింది.  

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగానే డిప్యూటీ సీఎంవో కార్యాలయం ఈ వీడియోను విడుదల చేసింది.

అటవీ శాఖ  మాజీ  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారు. అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది? ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారింది? తదితర విషయాలను తనకు నివేదించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.  ఈ కబ్జా వ్యవహారంలో  ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాలని అధికారులను నిర్దేశించారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నఅధికారులు, వెంటనే అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్, ఛార్జ్ షీట్ దాఖలు చేశామని పవన్ కల్యాణ్ కు తెలిపారు. అలాగే ఆక్రమణలు తొలగించి ఆ భూమిని  స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో కేసుల వివరాలు ప్రొడ్యూస్ చేశామనీ వివరించారు.   

ఇలా ఉండగా పవన్ కల్యాణ్ ఆరోపణలను వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు.  తాము అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించ‌లేద‌నీ, వాటిని   కొనుగోలు చేశామ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్ప‌టి చంద్రబాబు ప్ర‌భుత్వ హ‌యాంలోనే తాము భూములు కొనుగోలు చేశామ‌న్నారు. వీటికి సంబంధించి త‌మ‌కు అన్ని ర‌కాల హ‌క్కులు ఉన్నాయ‌న్న మిథున్ రెడ్డి, ఆన్‌లైన్‌లో స‌ర్వే నెంబ‌ర్ల వారీగా విచార‌ణ చేసుకోవ‌చ్చ‌న్నారు. అటవీ భూములను తాము ఆక్రమించుకున్నట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు.  అలా నిరూపించలేకుంటే.. తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  త‌మ కుటుంబాన్నిఅప్రతిష్ఠ పాలు చేసేందుకే పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.  

అయితే మొత్తంగా పవన్ కల్యాణ్ బయటపెట్టిన విషయాలు ఒక్కసారిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలను ఉలిక్కిపడేలా చేశాయి. అటవీ ప్రాంతంలో భూములు వారసత్వంగా ఎలా వస్తాయనీ, ఒక వేళ వాటిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నా, అందుకు అటవీ చట్టాలు అనుమతించవనీ తెలిసిందే. వాస్తవానికి  ఈ విషయంలో గతంలోనే విచారణ చేసిన అధికారులు కబ్జాను గుర్తించి ఆ భూములను వెనక్కు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే తీసి మరీ పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాను వీడియోలు తీసి మరీ బయటపెట్టారు. 

అయితే పవన్ ఆరోపణలను ఖండించిన మిథున్ రెడ్డి కబ్జా చేయలేదని చెప్పకుండా రుజువు చేయాలంటూ సవాల్ విసురుతున్నారు.  అయితే మిథున్ రెడ్డి ఖండనను, సవాల్ ను తోసిపుచ్చుతూ అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల కబ్జా వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. అలా కబ్జా చేసిన భూములను వెనక్కు తీసుకున్నామనీ, విచారణ కొనసాగుతోందనీ ప్రకటించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu