పవన్ కళ్యాణ్ ఆ సూచన చిరంజీవికేనా?

posted on: Oct 16, 2014 1:07PM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తుఫాను విపత్తును ఎదుర్కొంటున్న వేళ ఈ అంశాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే నాయకులను చూస్తే ఎవరికైనా చిరాకు పడుతుంది. రాజకీయ నడపడానికి ఏ అంశమూ లేనట్టుగా ఈ బాధాకర అంశాన్ని కూడా వాడుకోవాలని అనుకోవడం కొంతమంది రాజకీయ నాయకుల చిన్నతనాన్ని చూపిస్తూ వుంటుంది. ఆ విషయాన్నే గురువారం నాడు విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. విశాఖకు తుఫాను వచ్చిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖకు రావడమే కాకుండా, వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని, చంద్రబాబు నాయుడు వైజాగ్‌లోనే మకాం వేసి ప్రజలకు అండగా నిలబడటాన్ని పవన్ కళ్యాణ్ మనస్పూర్తిగా అభినందించారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ మరో మాట కూడా అన్నారు. ఇలాంటి సందర్భాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదని కూడా అన్నారు. ఈ సందర్భాన్ని చాలామంది రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే ఈ కామెంట్లు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటన విశాఖ విపత్తు అంశాన్ని రాజకీయాలకు వాడుకునేవిధంగానే వుంది. ప్రధానమంత్రి మోడీ వెయ్యి కోట్ల తక్షణ సాయం ప్రకటించడం చాలా తక్కువ అని, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఆర్థిక సాయం అందేలా కృషి చేయలేకపోయిందన్నట్టుగా చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు. నరేంద్రమోడీ చాలా తక్కువ ఆర్థిక సాయం ప్రకటించడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని చిరంజీవి లేనిపోని ఆశ్చర్యాన్ని ప్రదర్శించారు. చిరంజీవి తన లేఖలో వ్యక్తం చేసిన ఈ ధోరణికి వ్యతిరేకంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. విశాఖ విపత్తులో వుంటే తీరిగ్గా 19, 20 తారీఖులలో పరామర్శకు వస్తానని చెప్పిన చిరంజీవి పద్ధతి కూడా పవన్ కళ్యాణ్‌కి నచ్చలేదని తెలుస్తోంది. అంతా అయిపోయిన తీరిగ్గా విహార యాత్రకు వచ్చినట్టు వస్తానని అనడం, తుఫాను అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని ప్రయత్నించడం పవన్ కళ్యాణ్‌కి చిరాకు పుట్టించిందని సమాచారం. ఆ చిరాకే గురువారం ఆయన చేసిన కామెంట్ల రూపంలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...