కేంద్ర మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఆశలు!

posted on: Apr 29, 2014 3:41PM

 

 

 

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠం మీద ఆశలు పెట్టుకున్నాడో లేదోగానీ, బీజేపీ, టీడీపీ కూటమి తరఫున ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్ర మంత్రి పదవి మీద గొంతు వరకూ ఆశలు పెట్టేసుకున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి పదవి మీద మోడీ ఆశ పెట్టాడో, ఈయనకి ఈయనే ఊహించేసుకుని ఎన్నికల ప్రచారంలో ఎడాపెడా పాల్గొంటున్నాడోగానీ, మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ వరస చూస్తుంటే కేంద్ర మంత్రి పదవి మీద కూర్చోవాలని ఉబలాటపడిపోతున్నట్టు అర్థమవుతూనే వుంది.

 

తనకి కేంద్ర మంత్రి పదవి వస్తే జనాలు ఒక్కసారిగా షాక్ తినకుండా పవన్ అందర్నీ మానసికంగా ప్రిపేర్ కూడా చేస్తున్నాడు. మొన్న కామారెడ్డి సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తన కేంద్ర మంతి ‘కళ’లను ప్రదర్శించాడు. తాను భవిష్యత్తులో సినిమాలలోఎక్కువగా నటించనని, తాను దేశసేవలోనే నిమగ్నమవ్వాలని అనుకుంటున్నానని ప్రకటించేశాడు. ఈరోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటివాళ్ళు ‘దేశసేవ’ చేయాలంటే మంత్రి పదవి కంపల్సరీ కదా!


రేపు బీజేపీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్‌కి అర్జెంటుగా రాజ్యసభ మెంబర్‌షిప్ ఇచ్చేసి, కేంద్రమంత్రి పదవిని తాంబూలంలో పెట్టి అప్పగిస్తుందని పవన్ కళ్యాణ్ సన్నిహితులు అనుకుంటున్నారు. చిరంజీవి కి కాంగ్రెస్ పార్టీ కేంద్ర సహాయమంత్రి పదవి మాత్రమే ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌కి కేబినెట్ హోదా వున్న కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఈ ఆశలన్నీ నిజమవుతాయా, పవన్ కళ్యాణ్‌ని కూరలో కరేపాకులా వాడేసుకున్నారా అనే విషయం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...