Latest News
పార్దీబన్ వ్యాఖ్యల వెనుక పవన్?
posted on: Mar 16, 2026 10:54AM

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భవిష్యత్ లో ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు అంటూ నటుడు పార్దీబన్ వ్యాఖ్యలకు అందరూ చప్పట్లు చరుస్తూ.. ఈళలు వేస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం ఒకింత సీరియస్ గా ముఖం పెట్టారు. ఒకింత అసహనంగా కూడా కనిపించారు. దీనితో పార్దీబన్ వ్యాఖ్యల ఔచిత్యంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.
వాస్తవానికి పవన్ కల్యాణ్ ప్రస్తుతం కూటమి ఐక్యత, పటిష్ఠతపై పూర్తిగా దృష్టి సారించారు. మరో దశాబ్దంన్నర పాటు కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలని, ఉంటుందనీ గట్టిగా చెబుతున్నారాయన. రాష్ట్ర అభివృద్ధి నిరాటంకంగా కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగి తారాలని చెబుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం.. అనే పదవులు ముఖ్యం కాదు.. రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యం అన్నది ఆయన ఇన్ టెన్షన్. కాగా ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ రాష్ట్రంలోని అధికార కూటమిలో భాగస్వామి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ధర్మానికి విరుద్ధంగా తనను తాను సీఎం అనిపించుకోవడానికి పవన్ కల్యాణ్ ఇసుమంతైనా సుముఖత చూపడంలేదు. అయితే సినిమా ఫంక్షన్లలోనూ, సభలలోనూ, పార్టీ సమావేశాల్లోనూ వక్తలు.. పవన్ కల్యాణ్ సీఎం అంటూ చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన అసహనానికి గురౌతున్నట్లు కనిపిస్తోంది. అలాంటి వారికి మనం ఏం చెప్పగలం? అన్న నిర్వేదం పార్దీబన్ వ్యాఖ్యల సమయంలో పవన్ మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది.
కేవలం పార్దీపన్ అనే కాదు.. హిందుత్వ విషయంలో పవన్ ని తీవ్రంగా వ్యతిరేకించే సత్య రాజ్ కూడా ఎన్టీఆర్ తర్వాత తెలుగులో అంతగా సక్సెస్ అయిన పొలిటికల్ హీరో పవన్ కళ్యాణే అంటూ ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలున్నాయి. అయితే వీటన్నిటినీ జనసేనాని వినీ విననట్టు వదిలేస్తుంటారు. బెంగళూరు వెళ్లినపుడు జూనియర్ ఎన్టీఆర్ నే సీఎం సీఎం అంటూ అభిమానులు అరుస్తుంటే.. ఇక్కడ ఆంధ్ర నడిబొడ్డున కూర్చుని ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి ఆ మాత్రం ఎలివేషన్లు అసాధారణమేమీ కాదంటారు పరిశీలకులు. భవిష్యత్ సంగతి పక్కన పెడితే.. ఈ టరమ్ లోనే లోకేష్ సీఎం కాబోతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ సీఎం అంటూ ఎవరెవరో చేస్తున్న వ్యాఖ్యలకు అర్ధం లేదంటున్నారు.
ఏది ఏమైనా పవన్ కల్యాణ్ ను మాత్రం సీఎం పదవి ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తోంది. అదలా ఉంచితే.. రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని, రాష్ట్ర రాజకీయాలతో ఇసుమంతైనా పరిచయం లేని పార్దీబన్ వంటి నటులు పవన్ కల్యాణ్ సీఎం అవుతారంటూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఎవరున్నారన్నది ప్రశ్నార్ధకం. పవన్ కల్యాణ్ ఒక పక్క జనసేన 15 ఏళ్ల పాటు కూటమిలోనే ఉంటుందని సందేహాలకు అతీతంగా ప్రకటిస్తున్నారు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసే ఉంటాయని కుండబద్దలు కొడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి పీఠం తెలుగుదేశం ఖాతాలోనే ఉంటుందని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు పవన్ కల్యాణే స్వయంగా రాష్ట్రంతో సంబంధం లేని తమిళనటులతో పవన్ సీఎం అన్న మాట అనిపిస్తున్నారా? అంటూ కొందరు డౌటనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి.. పవన్ సీఎం అంటూ పార్దీబన్ వంటి తమిళనటుల కామెంట్ల వ్యవహారం ఎంత కాలం కొనసాగుతుందో?


.webp)



