మళ్ళీ పవన్ కళ్యాణ్ ట్వీట్ పడింది
posted on Aug 19, 2015 3:17PM
.jpeg)
ఈనెల 20, అంటే రేపటి నుండి రాజధాని ప్రాంతంలో మిగిలిన భూములను సేకరించేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతుంటే, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన ట్వీట్స్ లో వేడి, వేగం కూడా పెంచుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన మళ్ళీ ఒక ట్వీట్ మెసేజ్ పెట్టారు. ఈసారి ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేరిటే నేరుగా ట్వీట్ చేసారు.
ఆయన తన ట్వీట్ మెసేజ్ లో ఏమని వ్రాసారంటే “ఏ దేశంలో ఎవరు పరిపాలిస్తున్నప్పటికీ ఒక ప్రాంతం లేదా ఒక సమూహం అభివృద్ధి చెందుతున్నప్పుడు కొంత పర్యావరణ నష్టం, అక్కడి ప్రజలు నిర్వాసితులవడం ఆకారణంగా వారు వ్యతిరేకత చూపడం నాగరికత అభివృద్ధిలో సహజమే. కానీ ఎంత తక్కువ నష్టంలో అభివృద్ధి సాదంచామనేది పరిపాలకుల తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఉండవల్లి, పెనుమాక, బేతంపల్లి మరియు నదీ పరివాహక గ్రామాలు చాలా సారవంతమయినవి. వాటి కోసం భూసేకరణ చట్టం ప్రయోగించవద్దని నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ మెసేజ్ చేసారు.
కానీ ఇటువంటి సలహాలు ఈయడం కంటే ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించవచ్చో పవన్ కళ్యాణ్ చెపితే బాగుంటుందని రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజధాని ప్రాంతానికి సరిగ్గా మధ్యలో ఉన్న ఆ గ్రామాలను విడిచి పెట్టి రాజధాని నిర్మాణం ఏవిధంగా చేయాలో చెపితే బాగుంటుందని అన్నారు. వాటిని విడిచిపెట్టి రాజధానిని గాలిలో నిర్మించలేమని, అలా నిర్మించేందుకు తామేమీ విశ్వామిత్ర మహర్షులంకామని, యనమల కాస్త ఘాటుగానే జవాబిచ్చారు.