ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మళ్ళీ హెచ్చరికలు జారీ
posted on Aug 17, 2015 12:58PM
.jpeg)
రాజధాని ప్రాంతంలో ఇంకా భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న కొద్ది మంది రైతుల నుండి భూసేకరణ చట్టం ద్వారా ఈనెల 20నుండి భూములు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, అక్టోబర్ నుండి రాజధాని నిర్మాణ పనులు మొదలుపెట్టాలని భావిస్తున్నందున ఏదోవిధంగా భూసేకరణ చేయడం అనివార్యంగా మారింది. లేకుంటే రాజధాని నిర్మాణపనులు మొదలుపెట్టడం సాధ్యం కాదు. ఈ సంగతి నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై ట్వీట్ బాణాలు సందిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆయన నేటికీ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ నిన్న మరొకమారు ఇదే అంశంపై ట్వీట్ చేశారు. “రైతులపై భూసేకరణ చట్టం ప్రయోగించి ఏడాదికి మూడు పంటలు పండే భూములను స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్ చేసారు.
ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ఆయన ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులతో ఘర్షణపై వారిని నొప్పించి భూములు తీసుకోవాలనుకోవడం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ చట్టం ఉపయోగించవలసి వస్తోంది. ఈ సంగతి కూడా పవన్ కళ్యాణ్ కి బాగానే తెలిసుండాలి. కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోమని ప్రభుత్వానికి ఉచిత సలహా ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఏవిధంగా పరిష్కరించుకొవచ్చో చెపితే బాగుండేది. ఈ సమస్య పరిష్కారానికి స్వయంగా ఆయనే చొరవ తీసుకొని ప్రయత్నించినా అందరూ హర్షించేవారు. కానీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోమని సూచిస్తూ తనే స్వయంగా ప్రభుత్వానికి కొత్త సమస్య సృష్టిస్తూ సవాలు విసురుతున్నారు. మిత్రపక్షంగా ఉన్న తెదేపా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అండగా నిలబడటం లేదు. అలాగని రైతుల తరపునా నిలబడి పోరాడటం లేదు. ఈవిధంగా ట్వీట్ మెసేజులు పెడుతూ కాలక్షేపం చేసేబదులు ఈ సమస్యపై తన వైఖరి ఏమిటో, తను ఏమి చేయదలచుకొన్నారో స్పష్టంగా చెప్పగలిగితే బాగుంటుంది కదా?