భూసేకరణపై పవన్ కళ్యాణ్ వైఖరేమిటో?

 

ప్రముఖ నటుడు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. రాజధాని భూసేకరణ విషయంలో ఆయన కూడా అభ్యంతరం చెప్పారు. కానీ ఆయన తెదేపాకు మద్దతు తెలుపుతున్నారు. గనుక ఈరోజు ఆయన చేయబోయే పర్యటనకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను, అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకొంటారు. కానీ ఆ తరువాత ఆయన ఈ వ్యవహారంపై ఏవిధంగా స్పందిస్తారనేదే చాలా ఆసక్తికరంగా మారింది.

 

ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తరువాత తుళ్ళూరు గ్రామాలలో పర్యటిస్తారని వార్త వెలువడగానే వైకాపా షాక్ తింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే ముందుగా అయన పర్యటిస్తే రైతులు మనసులు మార్చుకొంటారనే భయం కావచ్చును. లేదా ఈ అంశం నుండి రాజకీయ లబ్ది పొందేందుకు ఇంతకాలంగా చేస్తున్న తన పోరాటాన్ని ఆయన ఎక్కడ హైజాక్ చేసుకుపోతాడో అనే భయం కావచ్చును. అందుకే ఆయన చంద్రబాబు తరపున రైతులకు నచ్చజెప్పేందుకే తుళ్ళూరు పర్యటనకి బయలుదేరుతున్నారని ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఆయన పర్యటన ఉద్దేశ్యం ఏమిటో..ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో తెలియకుండానే చేతిలో బలమయిన మీడియా ఉంది కదాని ప్రచారం చేయడం అవివేకం.

 

మరికొద్ది సేపటిలో ఆయన తూళ్ళురు గ్రామాల రైతులతో మీడియా సాక్షిగానే మాట్లాడబోతున్నారు. మరి అటువంటప్పుడు తినబోతూ గారెల రుచి ఎలా ఉంటుందని ఆలోచించడం ఎందుకు?