పవన్ కళ్యాణ్ మాట మన్నిస్తే మేలు కదా!

posted on: Feb 24, 2015 6:47AM

 

ఇంతవరకు మౌనంగా ఉన్న జనసేన ఏకవీరుడు పవన్ కళ్యాణ్ కూడా మోడీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు మొట్ట మొదటిసారిగా ఒక చిన్న ట్వీట్ బాణం సంధించారు. ఆయన జనసేన పార్టీతో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోటీ నుండి తప్పుకొని మొదట మోడీకి, బీజేపీకి ఆ తరువాత తెదేపాకి కూడా బేషరతుగా తన మద్దతు ప్రకటించడమే గాక వారి తరపున రెండు రాష్ట్రాలలో ప్రచారం కూడా చేసారు. అంతే కాదు తను ఎంతో అభిమానించే, గౌరవించే తన అన్న చిరంజీవికి వ్యతిరేకించారు. “కాంగ్రెస్ హటావ్ దేశ్ కో బచావ్” అని ప్రజలకు పిలుపునిచ్చారు కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఒక్కరు కూడా గెలవలేకపోవడానికి, పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం కూడా ఒక కారణమని అందరికీ తెలుసు.

 

మోడీపై పూర్తి నమ్మకం ఉంచి ఎన్డీయే కూటమికే ప్రజలు ఓట్లు వేసి అధికారం కట్టబట్టినట్లయితే ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని తప్పకుండా అమలుచేస్తారని ఆయన తరపున పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ప్రజలకు చెప్పారు. మోడీపై ప్రజలు ఎంతటి నమ్మకం ఉంచారో అంతకంటే ఎక్కువే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నందునే ఆయన మాట మన్నించి ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. ఎన్డీయేకు ఎంతో కీలకమయిన ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆ త్యాగాన్ని, అందించిన సహకారాన్ని మోడీ ఎన్నడూ మరిచిపోరని ప్రజలు కూడా ఆశిస్తారు.

 

ఒకవేళ మోడీ ప్రభుత్వం మాట తప్పినట్లయితే, ఆయన తరపున హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ న్నే ప్రజలు ముందుగా నిలదీస్తారు. కనుక ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కల్పించకుండా, ఆయన ఎన్డీయే తరపున చేసిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...