పవన్ కళ్యాణ్ బకరా కానున్నారా?

posted on: Apr 28, 2014 12:23PM

 

ఇటీవల తెలంగాణాలో వరుసపెట్టి నాలుగు సభలలో మాట్లాడిన నరేంద్ర మోడీ, తన ప్రసంగాలలో తెరాసను కానీ, దాని అధ్యక్షుడు కేసీఆర్ ను గానీ గట్టిగా విమర్శించలేదు. అందువల్ల శాస్త్రం కోసమనట్లు ఏదో మొక్కుబడిగా తెరాస గురించి ఓ రెండు ముక్కలు మాట్లాడి సరిబెట్టేసారు. అయితే, ఈమధ్యనే జనసేన పార్టీతో రాజకీయాలలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్ తెదేపా-బీజేపీ కూటమికి తన మద్దతు తెలుపడమే కాకుండా వారి అభ్యర్ధుల తరపున తెలంగాణా లో చాల గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

 

ఆ ప్రచారంలో ఆయన కాంగ్రెస్, తెరాసలపై చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “కేసీఆర్! పిచ్చిపిచ్చి కూతలు కూస్తే నీ తాట తీస్తా!” అంటూ తీవ్రంగా హెచ్చరించారు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శలను ఎంత మాత్రం పట్టించుకొన్నట్లు కనబడలేదు, కానీ కేసీఆర్ మాత్రం అంతే దీటుగా ప్రతిస్పందిస్తూ ‘నేను చిటికేస్తే కనబడకుండా పోతావని’ గట్టిగానే హెచ్చరించారు. పనిలోపనిగా చంద్రబాబుని, నరేంద్ర మోడీని కూడా మరోమారు తీవ్రంగా విమర్శించారు.

 

ప్రస్తుతం చంద్రబాబు, కేసీఆర్ ఒకరినొకరు ఎంతగా విమర్శించుకొన్నా, ఎన్నికల తరువాత ఒకవేళ ఇరువురూ ఆంధ్ర తెలంగాణాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగితే అప్పుడు వారు ఒకరికొకరు సహకరించుకొన్నా ఆశ్చర్యం లేదు. లేదా అసలు ఒకరినొకరు ఎంత మాత్రం పట్టించుకోకపోవచ్చును. అదేవిధంగా ఒకవేళ కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో తెరాస అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు తెలంగాణా అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు, సహకారం కావలసి ఉంటుంది గనుక, కేసీఆర్ తాను ఇప్పుడు నోరారా తిడుతున్న మోడీకే తప్పనిసరిగా మద్దతు ఈయవచ్చును. బహుశః ఎన్నికల తరువాత తెరాస మద్దతు అవసరం ఉండవచ్చనే ముంచు చూపుతోనే మోడీ కూడా కేసీఆర్ పై ఎటువంటి విమర్శలు చేయలేదనుకోవాలి. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతే అప్పుడు మోడీ గుజరాత్ తిరుగు ప్రయాణమయిపోవడం తధ్యం. అప్పుడు మధ్యలో నష్టపోయేది ఈ రాజకీయాలు తెలియని పవన్ కళ్యాణ్ మాత్రమే. అంటే వీరందరరి కోసం మధ్యలో పవన్ కళ్యాణ్ బకరా అయ్యేరనుకోవచ్చును.

 

ఎన్నికల తరువాత ఒకవేళ తెరాస ప్రభుత్వ పగ్గాలు చేపట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన తన తాట తీస్తానని హెచ్చరించినందుకు పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలు చేపడితే, మరి అప్పుడు మోడీ కానీ చంద్రబాబు గానీ ఆయనను ఆదుకొనేందుకు వస్తారో లేదో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవడం మేలు.

google-ad-img
    Related Sigment News
    • Loading...