Latest News
నందిగురువు ఏజెన్సీ ప్రాంతానికి డిప్యూటీ సీఎం వరాలు
posted on: Mar 14, 2026 7:40PM

ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాడేరు నియోజకవర్గం నందిగరువు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనసేన పార్టీఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘డోలి మోత’లతో ఇబ్బందులు పడుతున్న మారుమూల గ్రామం నుంచి మార్పు మొదలు కావాలని, అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
.webp)
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సమస్యలు ఏవైనా రాత్రికి రాత్రే పరిష్కారం కావని, కానీ పరిష్కరించాలనే సంకల్పం తమకుందన్నారు. ప్రధానమంత్రి నిధులతోనే ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం సాధ్యమైందని, వైసీపీ ప్రభుత్వంలో ఈ నిధులు ఏమయ్యాయో మీరు నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.

నందిగరువు గ్రామస్తుల విన్నపం మేరకు కొత్త పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, 1.6 కిలోమీటర్ల మేర నూతన రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు మంజూరు చేశారు. అలాగే, సుమారు 3 వేల గ్రామాలకు తాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధికి కీలకమైన జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.







