పరకాలకు త్వరలో మంత్రి పదవి?

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా ఉన్న డా. పరకాల ప్రభాకర్ ని త్వరలో తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకోసం మార్చి నెలలో జరుగనున్న యం.యల్.సి. ఎన్నికలలో ఆయనకి గవర్నర్ కోటాలో సీటు ఇచ్చి విధానసభ సభ్యునిగా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్నికలలోగానే ఆయనను చంద్రబాబు తన మంత్రివర్గంలో మంత్రిగా తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ఈ సమాచారం నిజమనుకొంటే చంద్రబాబు నాయుడు ఇంత అకస్మాత్తుగా ఆయనను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకొంటున్నారు? ఆయనకి ఏ శాఖ బాధ్యతలు అప్పగించబోతున్నారు? వేరెవకయినా ఉద్వాసన పలకబోతున్నారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.

 

డా. పరకాలను మీడియా సలహాదారుగా నియమించుకొన్న తరువాత చంద్రబాబు నాయుడు ఆయనను దేశ విదేశాలలో చేసే యాత్రలకి, మీడియా సమావేశాలలో తన వెన్నంటే ఉంచుకొంటూ ఆయనకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఆయనకి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా చేస్తున్న ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ ద్వారా కేంద్రం నుండి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది గనుక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే బహుశః ఆయన ఈ నిర్ణయం తీసుకొంటున్నారేమో? అయినా ఈ వార్తలు అధికారికంగా దృవీకరించవలసి ఉంది.