శశికళ ఆశలు... బూడిదలో పోసిన 'పన్నీర్'!
posted on Feb 8, 2017 10:50AM

సోషల్ మీడియాలో నిన్నటి వరకూ పన్నీర్ సెల్వం గురించి చాలా జోక్స్ షేరింగ్ అయ్యాయి! ముఖ్యంగా, ఆయన సిటీ బస్సులో లేడీస్ సీట్లో కూర్చున్న ప్రయాణికుడి లాంటివాడని చాలా మంది కామెడీ చేశారు! అందుకే, అమ్మ వచ్చినా, చిన్నమ్మ వచ్చిన లేచి నిలబడి కుర్చీ ఇచ్చేస్తుంటాడని కామెంట్ చేశారు! అది నిజమే కూడా! కాని, రాత్రికి రాత్రి సీన్ మొత్తం మారిపోయింది! పన్నీర్ సెల్వం శశికళ ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ గా మార్చే స్కెచ్ వేశాడు! తనలోనూ అవసరాన్ని బట్టి తెగించే రాజకీయ నేత వున్నాడని సిగ్నల్స్ ఇచ్చాడు...
అర్థ రాత్రి కావస్తోంటే తమిళనాడులో రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. జయ బతికి వున్నప్పటి లాగే ఇప్పుడూ ఆమె చుట్టూనే పొలిటికల్ డ్రామా రన్ చేస్తున్నారు తమిళ నేతలు. శశికళ జయ సమాధి దర్శించుకుని తాను సీఎం అవుతానని ప్రకటిస్తే... పన్నీర్ అదే జయలలిత సమాధి వద్ద ధ్యానం చేసి మరీ తిరుగుబాటు ప్రకటించాడు. అమ్మ అత్మ తనని తమిళ ముఖ్యమంత్రిగా కొనసాగమన్నదని చెప్పుకొచ్చాడు. దీంతో శశికళకు, సీఎం పీఠానికి మధ్య మరో పెద్ద అడ్డంకిగా సెల్వం మారిపోయాడు!
శశికళ సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అది ఆమెకి పుష్కలంగా వుంది. కాని, లేనిదల్లా అదృష్టమే! ఒకవైపు జనంలో ఆమె పట్ల అంతగా సద్భావం లేకపోవటం, కేంద్రంలోని బీజేపి సర్కార్ కూడా శశికళ కంటే పన్నీర్ సెల్వాన్నే ఇష్టపడుతుండటం, అన్నిటికంటే మించి సుప్రీమ్ కోర్టులో చిన్నమ్మపై పెద్ద తీర్పు వేలాడుతూ వుండటం ఛేదించరాని చిక్కులుగా మారాయి. ఇక ఇప్పుడు పన్నీర్ సెల్వం తిరుగుబాటు శశికళ కన్నీరుకు మరింత కారణమైంది!
పన్నీర్ సెల్వం తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని చెప్పినంత మాత్రాన శశికళకు పార్టీలో వున్న మద్దతు తుడిచి పెట్టుకుపోయేది కాదు. కాని, ఏ నిర్ణయం చెప్పకుండా ముఖం చాటేస్తున్న గవర్నర్ విద్యాసాగర్ రావుకి ఇది మంచి అవకాశం. పన్నీర్ తిరుగుబాటు కారణంగా చూపి ఆయన శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా వుండవచ్చు. అవసరమైతే బలనిరూపణ అంటూ కొంత కాలయాపన చేయవచ్చు. ఇంతలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు రానే వస్తుంది! అందులోంచి శశికళ కళంకం లేకుండా బయటపడుతుందనే నమ్మకం ఆమెతో సహా దాదాపుగా ఎవరికీ లేదు.
ఇప్పటికే జయలలితకు ఎంతో నమ్మకస్థుడైన సెల్వంపై వేటు వేసింది శశికళ. పార్టీ పదవి నుంచి ఆయనను తొలగించింది. ప్రాథమిక సభ్యత్వం కూడా వుండదని చెబుతోంది. ఇవన్నీ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చాక ఆమెకు ప్రజల్లో సానుభూతి తగ్గేలా చేస్తాయి. ఇప్పటికే ఆమె పట్ల అభిమానం అంతంత మాత్రం. మరో వైపు జయ మేనకొడలు, ఏఐఏడీఎంకే నేత పాండ్యన్, సెల్వం, నటి గౌతమి ... ఇలా చాలా మంది జయ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. స్టాలిన్ ది కూడా అదే మాట. ఇటువంటి నేపథ్యంలో కేంద్రం దర్యాప్తుకు ఆదేశిస్తే శశికళ చిక్కులు మరింత పెరిగిపోతాయి. మొత్తానికి ఒక్కో పరిణామం ఆమెను సీఎం కుర్చీకి దూర దూరంగా జరుపుకుంటూనే వస్తుంది తప్ప ఇప్పటికిప్పుడు సెక్రటేరియట్ కి దార్లు సుగమం అయ్యేలా కనిపించటం లేదు!
శశికళకు వ్యతిరేకంగా తీర్పు వచ్చాక కూడా ఎమ్మెల్యేలు ఆమె వెంటే వుంటామని అంటారా? అలా జరగటం అరుదు. మెల్లగా ప్లేటు ఫిరాయించే వారే ఎక్కువ. ఆ నమ్మకంతోనే పన్నీర్ సెల్వం బల పరీక్షకు సిద్ధం అంటున్నాడు. ఒకవేళ ఆయన బలనిరూపణ చేసుకోలేక పోతే... శశికళ జైలుకి వెళ్లాల్సి వస్తే ... ఎవరు సీఎం? ఇలాంటి గందరగోల పరిస్థితుల్లో డీఎంకే కోరుకుంటున్నట్టు గవర్నర్ పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపికి కూడా రజినీకాంత్ పార్టీని అడ్డుపెట్టుకుని తమిళనాడు అసెంబ్లీలో కాలుపెట్టాలని మనసులో కోరిక వుంది. అందుకు, గవర్నర్ పాలన చక్కగా ఆరేడు నెలల సమయం ఇస్తుంది! పన్నీర్ సెల్వం లాంటి శశికళ వ్యతిరేక వర్గం బీజేపికి అండగా వుంటుంది..
ఇప్పటికైతే... తమిళ రాజకీయాలు అమీబాలాగా మారిపోయాయి! ఎప్పుడు ఏ రూపం తీసుకుంటాయో ఎవ్వరికీ తెలియదు!