Latest News
పాకిస్థాన్ అడుగంటిన ముడిచమురు నిల్వలు.. సంక్షోభం ముంగిట దాయాది దేశం
posted on: Mar 20, 2026 12:35PM

పాకిస్థాన్ పరిస్థతి గోరుచుట్టు మీద రోకలి పోటులా తయారైంది. ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలమౌతున్న పాకిస్థాన్ పై యుద్ధ ప్రభావం పడింది. దీంతో ఇంధన సంక్షోభం ముంగిట ఆ దేశం నిలిచింది. ఔను ప్రస్తుతం పాకిస్థాన్ ఇంధన కొరతతో విలవిలలాడుతోంది. దేశంలో ముడిచమురు నిల్వలు డేంజర్ మార్క్ స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు మరో 11 రోజులకు మాత్రమే సరిపోతాయి. అధికారిక నివేదికల ప్రకారం దేశంలో ముడిచమురు నిల్వలు నిండుకుంటున్నాయి. ఈ పరిణామం దేశవ్యాప్తంగా రవాణా, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపడం తథ్యమని నిపుణులు చెబుతున్నారు.
పెట్రోలియం రంగానికి సంబంధించి ఇటీవల జరిగిన సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ముడిచమురుతో పాటు ఇతర ఇంధన వనరుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద 21 రోజులకు సరిపడా డీజిల్, 27 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు, 14 రోజులకు సరిపడా విమాన ఇంధనం మాత్రమే ఉంది. ఇక ఎల్పీజీ గ్యాస్ అయితే కేవలం 9 రోజులకు మాత్రమే సరిపోతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం పాకిస్థాన్ ఇంధన సరఫరాకు పెను ముప్పుగా పరిణమించింది. పాకిస్థాన్ అవసరాలలో రమారమి 70 శాతం చమురును మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఎర్ర సముద్రం మీదుగా సాగే నౌకా రవాణాలో ఎదురవుతున్న అవాంతరాల వల్ల, గతంలో 4 నుండి 5 రోజుల్లో వచ్చే సరుకు ఇప్పుడు 12 రోజులకు పైగా సమయం తీసుకుంటోంది.
చమురు సంక్షోభంతో పాటు ఏప్రిల్ మధ్య నాటికి దేశంలో ద్రవీకృత సహజ వాయువు కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ నెలలో రావాల్సిన 8 ఎల్ఎన్‌జీ కార్గోలలో కేవలం రెండు మాత్రమే ఇప్పటివరకు దేశానికి చేరుకున్నాయి. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి మరియు గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది.
ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితంగా చమురు రవాణా చేసేలా ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతానికి మార్చి నెలకు అవసరమైన నిల్వలు ఉన్నాయని, పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.అయితే సకాలంలో దిగుమతులు అందకపోతే పాకిస్థాన్‌లో జనజీవనం స్తంభించిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.



.webp)


