శాంతి యత్నాలకు మోకాలడ్డుతున్న పాకిస్ధాన్!?

posted on: Apr 10, 2026 10:30AM

మిడిల్ ఈస్ట్ లో శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు పాకిస్థాన్ మోకాలడ్డుతోందా? అంటే అంతర్జాతీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. మధ్య ప్రయత్నంలో శాంతి యత్నాలకు పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ వ్యాఖ్యలు గొడ్డలి పెట్టులా మారాయంటున్నారు.  పాక్ రక్షణ మంత్రి తాజాగా ఇజ్రాయెల్ దేశంపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. ఆ దేశాన్ని మానవాళికి శాపంగా మారిన దేశంగా అభివర్ణించారు. ఇప్పుడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ పెను దుమారం రేపుతున్నాయి. ఇవిఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి..  
ఇరాన్, అమెరికా మధ్య శాంతి కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తూనే ఇజ్రాయెల్ పాక్ నమ్మదగిన దేశం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ పై తన దాడులను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలవి. దీనిపై పాక్ రక్షణ మంత్రి ఒకింత అతిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పాక్ రక్షణ మంత్రి  ఖవాజా ఆసిఫ్  ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ తో పోల్చారు. పాలస్తీనా గడ్డపై ఈ దేశాన్ని సృష్టించిన వారు నరకయాతన అనుభవించాలని శాపనార్ధాలు పెట్టారు. గాజా, ఇరాన్ తర్వాత ఇప్పుడు లెబనాన్‌లో ఇజ్రాయెల్ రక్తపాతం సృష్టిస్తోందని, జాతి నిర్మూలనకు పాల్పడు తోందంటూ వ్యాఖ్యలు చేశారు. 

సహజంగానే  ఇజ్రాయెల్ ప్రభుత్వం పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. ఇజ్రాయెల్ వినాశనాన్ని కోరుకునేలా పాకిస్థాన్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఇటువంటి వ్యాఖ్యలను తాము సహించబోమనీ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఘాటుగా  స్పందించింది.  శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశం నుంచి ఇలాంటి ద్వేషపూరిత మాటలు దారుణమని పేర్కొంది.  

అదలా ఉంటే..  అమెరికా-ఇరాన్ మధ్య కీలకమైన శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సిన తరుణంగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  ఆ దేశాన్ని దౌత్యపరంగా ఇబ్బందుల్లో పడేశాయి.  దీనిని పాకిస్థాన్ ఎలా అధిగమిస్తుంది, తమ రక్షణ మంత్రి వ్యాఖ్యలను ఎలా సమర్ధించుకుంటుందన్నది వేచి చూడాలి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...