మ్యాచ్ ముందు గిన్నెలు కడిగాం...పాక్ హాకీ జట్టు కెప్టెన్ ఆరోపణలు

posted on: Feb 18, 2026 6:04PM

 

పాకిస్థాన్ హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి, నానా ఇక్కట్లకు గురైంది. వెళ్లిన నాటి నుంచి ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కనీస సౌకర్యాలకు నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులతో పాక్ ఆటగాళ్లు అక్కడ గడిపారు. అయితే తిరిగి వచ్చిన తర్వాత పాక్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ జాతీయ సమాఖ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆ పర్యటనలో సరైనా వసతి లేకపోవడంతో వీధుల్లో తిరిగాల్సి వచ్చిందని ఆరోపించాడు.

 ఈ మేరకు అతడు లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడాడు. దయనీయమైన విషయం ఏంటంటే.. మేం అక్కడ 13 రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం 10 రోజులకే వసతి ఏర్పాటు చేశారని, పది రోజుల తర్వాత మేము చౌకైన నివాసంలోకి మారామని, మ్యాచ్‌కు ముందు కిచెన్ శుభ్రం చేసి, గిన్నెలు కడిగి ఆటకు వెళ్లేవాళ్లమన్నాడు. ఈ విషయాలు మీడియాతో మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పాక్ హాకీ సమాఖ్య అధికారులు ఆటగాళ్లను హెచ్చరించారన్నాడు. 

తాము ఆటలో ముందుకు సాగాలంటే విదేశీ కోచ్ అవసరమని, జట్టులో మంచి ప్లేయర్లు ఉన్నా.. ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తో ముందుకు సాగలమన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తమ నుంచి ఇంతకు మించి ఎలాంటి ఫలితాలు ఆశిస్తారని హాకీ జట్టు కెప్టెన్ బట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో పాక్ జట్టు 2-3 తేడాతో ఓడిపోయింది. అలాగే జర్మనీ చేతిలోనూ ఓటమిని చవి చూసింది. పాకిస్థాన్ హాకీ జట్టు ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు బయలుదేరే ముందు సిడ్నీ విమానాశ్రయంలో 14 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

 


 

google-ad-img
    Related Sigment News
    • Loading...