Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బర్రెలకు డైపర్లు... లేదంటే ఆ దేశంలో పన్ను కట్టాల్సిందే
posted on: Apr 6, 2026 3:01PM

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకగా, తాజాగా అక్కడి పంజాబ్ ప్రభుత్వం పశుపోషకులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా పశువుల వ్యర్థాలపై 'గోబర్ టాక్స్' (పేడ పన్ను) విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వినూత్న పన్నును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. పశువుల యజమానులు ప్రతి ఆవు లేదా గేదెకు రోజుకు 30 పాకిస్థానీ రూపాయలను పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం పశుపోషకులను విస్మయానికి గురిచేస్తోంది.
తొలుత ప్రయోగాత్మకంగా లాహోర్‌లోని 168 పశువుల కాలనీలలో ఈ పన్నును అమలు చేయనున్నారు. ముఖ్యంగా హర్బన్స్‌పురా, గుజ్జర్‌పురా వంటి ప్రాంతాల్లోని డెయిరీ నిర్వాహకులపై ఈ భారం పడనుంది. ఈ వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంతో పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడమే కాకుండా, సేకరించిన వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పన్నును 'సుత్రా పంజాబ్' (పరిశుభ్రమైన పంజాబ్) కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు. పశువుల వ్యర్థాల వల్ల నగరాల్లో మురుగునీటి కాల్వలు పూడిపోతున్నాయని, పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని అధికారులు వాదిస్తున్నారు. అందుకే వ్యర్థాల సేకరణ, శుద్ధి కోసం ఈ రుసుమును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. "పేడ వేయడానికి కూడా పన్ను కట్టాలా?" అంటూ నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. పది పశువులు ఉన్న రైతు ఏడాదికి వేల రూపాయల భారం భరించాల్సి వస్తుందని, ఇది సామాన్య పశుపోషకులను ఆర్థికంగా దెబ్బతీస్తుందని విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర 450 రూపాయలు దాటిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో పశువులపై పన్నులు విధించడం హేయమని ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పన్నును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.






