భిక్షాటనతో బతుకు జీవుడా.. తమ దేశపరిస్థితిని కళ్లకు కట్టిన పాక్ ప్రధాని

posted on: Feb 5, 2026 2:19PM

పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దేశం పరిస్థితి ఎలా ఉందో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.  తాను, త‌న ఆర్మీ  చీఫ్ అసిం మునీర్ క‌ల‌సి విదేశాల‌కు వెళ్లి దాదాపు భిక్షాట‌న చేస్తున్నామ‌ని..  అక్కడ నుంచి అప్పులు పొందితేనే దేశంలో రోజు గడిచే పరిస్థితి ఉందని షహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి ఇది నిజంగా సిగ్గు చేటని కూడా అన్నారు.  ఆయా దేశాలు పాకిస్థాన్ కు అప్పులు ఇస్తున్నాయనీ, అయితే..అలా ఇవ్వడానికి సవాలక్ష కండీషన్లు, భయం గొలిపేలాంటి డిమాండ్లు చేస్తున్నాయన్నారు. అయితే దేశాన్ని నడపడం కోసం అన్నిటికీ డూడూబసవన్నలలా తలలూపి వారిచ్చే అప్పులు తీసుకుంటున్నామని పాకిస్థాన్ ప్రధాని చెప్పారు.  

పాకిస్తాన్ పాల‌న  ప్రధానంగా సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటుందన్నది జగమెరిగిన త్యం.  ఈ రెండు ఇక్కడి ప్రభుత్వాన్నీ, పాలననూ అలాగే దేశాన్ని ప్రమాదంలో పడేస్తుంటాయన్నది కూడా కాదనలేని వాస్తవమే. పాకిస్థాన్ లో ప్రభుత్వం ఏదైనా, పాలకుడు ఎవరైనా సరే సైన్యం, ఉగ్రవాదం చేతిలో బందీయే. ఆ రెంటికీ దాసోహం అంటూ మనుగడ సాగించాల్సిందే.   ఆ కారణంగానే.. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ఆపడానికి ఆ దేశం ఏకంగా 60 సార్లు అగ్రరాజ్యం అమెరికాను బతిమలాడుకుని కాళ్లా వేళ్లా పడాల్సి వచ్చింది.  ఆపరేషన్ సిందూర్ లో మ‌సూద్ అజ‌ర్ వంటి వారి ఉగ్ర  స్థావ‌రాలు కుప్ప‌కూల‌డ‌మే  గాక‌, వారి  కుటుంబ స‌భ్యులు కూడా మృతి చెందారు. అయితే అజర్ లో ఇసుమంతైనా మార్పు రాలేదు.  భారత్ ను రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్లుగా హెచ్చరికలతో విరుచుకుపడుతుంటాడు. అటువంటి హార్డ్ కోర్ ఉగ్రవాదికి పాకిస్థాన్ అడుగులకు మడుగులొత్తుతూ రాచమర్యాదలు చేస్తుంటుంది.  అలాగే తలమీద వెయ్యి కోట్ల రివార్డు ఉన్న ల‌ష్క‌రే తోయిబా  చీఫ్ హ‌ఫీస్ స‌య్య‌ద్ కు పాకిస్థాన్ ఆర్మీ  సెక్యూరిటీ  ఇస్తుంది. ఇలా పాకిస్థాన్ ను ఉగ్ర కర్మాగారంగా మారుస్తున్న ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ భద్రత కల్పిస్తూ కాపాడుతుంటే.. పాపం షహబాద్ షరీఫ్ వంటి ప్రధానులు కళ్లప్పగించి చూడటం తప్ప మరేం చేయలేని అసహాయ స్థితిలో ఉంటారు.  

అందుకే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అమెరికా, చైనా వంటి  దేశాల‌కు దాసోహం  అంటూ  ఆ దేశాలు  ఆడ‌మ‌న్న‌ట్ట‌ల్లా ఆడే కీలు బొమ్మ కింద త‌యారైంది పాకిస్థాన్ ప్ర‌భుత్వం.  స్వయంగా పాకిస్థాన్ ప్రధానే తాము భిక్షాటన చేస్తూ దేశాన్ని నడిపిస్తున్నామని చెప్పుకున్నారంటే పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటన్నది ఇట్టే అవగతమౌతుంది. అయినా కూడా భారత్ పై ద్వేషమే వెళ్లగక్కుతూ అనవసర అహంకారాన్ని ప్రదర్శించి  టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాము భార‌త్ తో ఆడే  ప్ర‌స‌క్తే లేద‌ని మరోసారి ప్రపంచం ముందు చులకన అయ్యింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...