Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Gaddar Awards: బాలీవుడ్‌ను ఏలిన పైడి జైరాజ్ గురించి తెలుసా?
posted on: Mar 19, 2026 7:49PM

సినీ ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వడమే కాకుండా.. సినీ దిగ్గజాల పేరిట కొన్ని ప్రత్యేక అవార్డులు కూడా అందిస్తుంది. అందులో 'పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు'(Paidi Jairaj Film Award) ఒకటి. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డుని అందిస్తున్నారు. గతేడాది ప్రముఖ దర్శకుడు మణిరత్నం అందుకోగా, ఈ ఏడాది కమల్ హాసన్ ను ఈ అవార్డు వరించడం విశేషం. (Gaddar Awards)
ఈ తరం వారికి పైడి జైరాజ్(Paidi Jairaj) గురించి పెద్దగా తెలియపోవచ్చు కానీ, ఆయన ఒక లెజెండ్. తొలి పాన్ ఇండియా హీరో. తెలంగాణ గడ్డపై పుట్టి, బాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్. భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే' అందుకున్న తొలి తెలంగాణ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇలా పైడి జైరాజ్ ఎన్నో ఘనతలు సాధించారు.
తెలుగు దిగ్గజాలు అనగానే మనకు ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ గుర్తుకు వస్తారు. కానీ, వీరికంటే ముందే.. అంటే మూకీ సినిమాల కాలంలోనే హిందీ చిత్రసీమలో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు పైడి జైరాజ్.
.webp)
పైడి జైరాజ్ 1909, సెప్టెంబర్ 28న సిరిసిల్లలో జన్మించారు. ఆయన అసలు పేరు పైడిపాటి జైరాజ్. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్న ఆయనకు.. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఇష్టం ఉండేది.
సినిమాల్లో నటించాలనే కోరికతో తన 19వ ఏట 1928లో ముంబై వెళ్లారు. అక్కడ మొదట కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశారు. 1929లో 'స్టార్ క్లింగ్ యూత్' అనే మూకీ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. మాతృ భూమి, ఆల్ ఫర్ లవర్, మై హీరో వంటి సినిమాల్లో నటించారు. వరుస సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగారు.
జైరాజ్ తన గంభీరమైన స్వరం, ఎత్తైన విగ్రహంతో చారిత్రక వీరుల పాత్రల్లో ఒదిగిపోయేవారు. పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, అమర్ సింగ్ రాథోడ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి గుర్తుండిపోయే పాత్రలు ఎన్నో చేశారు.
యాక్షన్ సీన్స్ కి కేరాఫ్ అడ్రెస్ అనేలా జైరాజ్ ఉండేవారట. ఇప్పుడు చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్స్ లకే డూప్‌లను వాడుతున్నారు. కానీ ఆ రోజుల్లోనే జైరాజ్ డేంజర్ సీక్వెన్స్ లను కూడా డూప్ లేకుండా స్వయంగా చేసేవారట. కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యలు కూడా ఆయనకు తెలుసు.
ఆ కాలంలోనే బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్‌పై ఆయనకు చాలా పట్టు ఉండేది. ఆయన ఆహార్యం, క్రమశిక్షణ చూసి అప్పట్లో కుర్రాళ్ళు జిమ్‌ల వైపు అడుగులు వేసేవారట. 60 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉండేవారని చెప్తారు.
జైరాజ్ హిందీ, మరాఠీ, గుజరాతీ వంటి భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ 1980లో ప్రభుత్వం ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించింది.
పైడి జైరాజ్ కేవలం నటుడే కాదు, దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన ముద్ర వేశారు. 2000వ సంవత్సరంలో 90 ఏళ్ళ వయసులో ఆయన కన్నుమూశారు.






