రూ.3 వేల కోసం 26 ప్రాణాలు బలి...పహల్గాం ఘటనలో షాకింగ్ విషయాలు

posted on: Apr 22, 2026 5:22PM

 

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి ఏడాది పూర్తయింది. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, ఆ కుటుంబాలు ఇంకా ఆ విషాదం నుండి కోలుకోలేక సతమతమవుతున్నాయి. అయితే, ఈ మారణహోమం వెనుక ఉన్న అసలు కారణాలు, స్థానికులు ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం తాజాగా ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగులోకి రావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ దాడికి పాల్పడిన పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు ఇద్దరు స్థానికులు సహకరించారని దర్యాప్తులో తేలింది. కేవలం రూ.3 వేల కోసం ఆ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించారు. తమ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని తెలిసినప్పటికీ, పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉన్నా.. ఆ ఇద్దరు స్థానికులు కక్కుర్తితో మౌనంగా ఉండిపోయారు.

దాడికి ముందు సుమారు ఐదు గంటల పాటు ఆ ఉగ్రవాదులు స్థానికుల ఆశ్రయంలోనే గడిపారు. అక్కడ భోజనం చేసి, బయలుదేరారు. ఆ తర్వాతి రోజు, ఏప్రిల్ 22న దాడికి కొద్ది గంటల ముందు, మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో బైసరన్ లోయలోని కంచె వెనుక ఉగ్రవాదులు దాక్కోవడం పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌లకు తెలిసింది.

అప్పుడు కూడా వారు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించారు. గంటల వ్యవధిలోనే అక్కడ తుపాకుల మోత వినిపించడం, లోయ రక్తసిక్తమవ్వడం చూసినా, వారు ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి జారుకున్నారు. తమ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వారు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ ఘటనపై ఎన్‌ఐఏ రంగంలోకి దిగి, గత ఏడాది జూన్ 22న వారిని అరెస్టు చేసింది. డిసెంబర్‌లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రధాన ఉగ్రవాది సాజిద్ జట్ట్‌తో పాటు ఈ ఇద్దరు స్థానికుల పాత్రను కూడా స్పష్టంగా పేర్కొంది.

ఇలాంటి ఘటనలు దేశ భద్రత విషయంలో అప్రమత్తత ఎంత అవసరమో గుర్తు చేస్తున్నాయి. స్థానికుల సహకారం లేనిదే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడటం అసాధ్యమని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...